IBomma Ravi Case: మూడు గంటలుగా ఐబొమ్మ రవి విచారణ.. ఈరోజైనా నోరు విప్పుతాడా?
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:49 PM
ఐబొమ్మ రవి కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. చివరి రోజు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబర్ 24: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో (IBomma Ravi Case) హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు రవిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజులుగా పలు కోణాల్లో విచారిస్తున్నారు. నేటితో రవి కస్టడీ పూర్తి కానుంది. చివరి రోజు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. మూడు గంటలుగా విచారణ కొనసాగుతోంది. నేటి సాయంత్రానికి కస్టడీ విచారణ ముగిసిన తర్వాత రవిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అయితే ఇప్పటి వరకు కొనసాగిన విచారణలో రవి నుంచి పోలీసులు ఎలాంటి సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది. మొదటిరోజు కస్టడీలో భాగంగా వెబ్‌సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వహకులతో సంబంధాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు.
రెండవ రోజు కస్టడీలో భాగంగా ఎస్‌బీఐ టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. ఇక మూడవరోజు కస్టడీలో భాగంగా రవికి ఉన్న భారీ నెట్‌వర్క్‌తో పాటు ఐపీ అడ్రస్‌ల మీద ఆరా తీశారు. మూడో రోజు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా రవిని విచారించారు. ఎథికల్ హ్యాకర్స్‌ను కూడా పిలిచి సర్వర్లు ఇతర అంశాల మీద సైబర్ క్రైమ్ పోలీసులు అడిగి తెలుసుకున్నారు.
నాలుగవ రోజు కస్టడీ విచారణలో భాగంగా బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బుల తరలింపు, ఐపి అడ్రస్సులు, విదేశాలలో ఉన్న నెట్‌వర్క్‌పై రవిని పోలీసులు ప్రశ్నించారు. చివర రోజు కస్టడీ విచారణలో ఆధారాలు ఎదురుగా ఉంచి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ల కొనుగోలుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే కస్టడీ విచారణలో భాగంగా రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా.. నాలుగు రోజుల విచారణ ముగిసినప్పటికీ రవి నుంచి వివరాలు రాబట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని సమాచారం. ఎన్నికోణాల్లో ప్రశ్నిస్తున్నా అతడు సహకరించడం లేదని.. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెబుతున్నట్లు పోలీసుల వర్గాలు చెబుతున్నాయి. ఇక పోలీసులు అడిగే ప్రశ్నలకు తప్పుదోవ పట్టించే విధంగా రవి సమాధానం చెబుతున్నారని సమాచారం.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్ పెట్టిన పోలీసులు
నా గురించి మాట్లాడితే తాట తీస్తా... నిరంజన్‌కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News