CM Revanth Reddy: నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు
ABN , Publish Date - Jul 14 , 2025 | 06:06 PM
మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ చురకలంటించారు.

నల్గొండ, జులై 14: బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి.. గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వ పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.34.20 కోట్ల విలువైన పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వలేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని.. బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు అంటే పేదవారి ఆత్మగౌరవం.. గుర్తింపు అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్ కార్డు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని.. ఈ హామీని తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దుష్ప్రచారం చేశారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన 18 నెలల కాలంలోనే రూ. 6,500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్
మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్‌లో సోడా పోయడమే నీకు తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.
సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌లే కాదు.. పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్ఎన్ నేతలదంటూ వ్యంగ్యంగా అన్నారు. పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగుతున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంధించారు. తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్ కార్డులు అందుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి