Share News

Floodwater Reservoir Gates: దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:54 AM

నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం, గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Floodwater Reservoir Gates: దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

  • తెరుచుకున్న సాగర్‌ గేట్లు, నీటి విడుదల

  • స్విచ్‌ ఆన్‌ చేసిన మంత్రులు ఉత్తమ్‌, లక్ష్మణ్‌కుమార్‌

  • జూలైలో గేట్లెత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

  • రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తొలగిస్తాం: ఉత్తమ్‌

  • సాగర్‌ గేట్లు ఎత్తే కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి డుమ్మా

  • గేమ్‌ఛేంజర్‌గా సన్నబియ్యం, రేషన్‌కార్డుల పంపిణీ

  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రేషన్‌ కార్డుల పంపిణీలో ఉత్తమ్‌

నాగార్జునసాగర్‌/యాదాద్రి/హుజూర్‌నగర్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడం, గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో ఉండడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11:28 గంటలకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లు ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఉత్తమ్‌ తొలుత 13వ నంబరు గేటును ఎత్తేందుకు స్విచ్‌ ఆన్‌ చేశారు. అనంతరం మరికొన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మకు వాయినం సమర్పించారు. గేట్లు ఎత్తిన తర్వాత ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పూడిక తొలగించడంతో పాటు ఆధునికీకరిస్తామని చెప్పారు. సాగర్‌ ప్రాజెక్టు గేట్లు జూలై నెలలో ఎత్తడం 18 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తోందని తెలిపారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉంటూ ప్రస్తుతం మంత్రిగా ఉండి సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత వానాకాలం, యాసంగి పంటలకు సాగు నీరు అందించామని.. ఫలితంగా 2.81 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.


సాగర్‌ ప్రధాన జలవిద్యుత్కేంద్రం ద్వారా గడిచిన నాలుగు రోజుల్లో రోజుకు 30వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటూ 700 మెగావాట్ల విద్యుదుద్పత్తి చేశామని తెలిపారు. కాగా, ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువకు నీటి విడుదలను పెంచారు. ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా మంగళవారం మరో 2,500 క్యూసెక్కులను మంత్రి ఉత్తమ్‌ చేతుల మీదుగా పెంచి, విడుదల చేశారు. మంగళవారం ఉదయం మంత్రులు 6 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత ఎగువ నుంచి వరద పెరగడంతో సాయంత్రం 4 గంటలకల్లా 26 గేట్లనూ ఎత్తారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. మంగళవారం సాయంత్రానికి 587.60అడుగులుగా నమోదైంది. 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి (2,30,804 క్యూసెక్కులు); కాలువలు, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 2,75,194 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. ఎగువ నుంచి 2,55,811 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.


మంత్రి కోమటిరెడ్డి గైర్హాజరు

సాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం మంత్రి వెంకటరెడ్డి కూడా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో సాగర్‌కు రావాల్సి ఉంది. అయితే మంత్రి వెంకటరెడ్డి గైర్హాజరవడంతో ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియాలో పలు రకాల కథనాలు ప్రసారమయ్యాయి. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ వద్ద గంటసేపు వేచి ఉండాల్సి రావడంతో చిరాకుతో మంత్రి వెంకటరెడ్డి సాగర్‌కు రాకుండా వెనక్కి వెళ్లిపోయారని కథనాలు ప్రసారమయ్యాయి.


గేమ్‌ఛేంజర్‌గా సన్నబియ్యం, రేషన్‌కార్డులు

రాష్ట్ర రాజకీయాల్లో సన్నబియ్యం, రేషన్‌ కార్డుల పంపిణీ పథకాలు గేమ్‌ఛేంజర్‌గా మారాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, కట్టంగూరుల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉత్తమ్‌ నూతన రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన రెండు పథకాలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యం అందిస్తే వాటిని రీసైక్లింగ్‌ చేసి కాకినాడ పోర్టుకు తరలించారని, కోళ్ల ఫారాలకు అమ్ముకున్నారని తెలిపారు. తెలంగాణలో అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందిస్తున్నామన్నారు. పేదల కడుపు నింపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం 3.15 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. రాష్ట్రాన్ని శాసించే శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఉందని, ఈ జిల్లా కాంగ్రెస్‌ ఖిల్లా అని.. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల త్యాగంతోనే ప్రభుత్వం ఏర్పడిందని ఉత్తమ్‌ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పేదలపై దృష్టి పెట్టలేదని, ప్రజాపాలనలో ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న లక్ష్యంతో నూతనంగా రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:54 AM