BJP: కమల దళపతి రాంచందర్‌రావు
ABN , Publish Date - Jul 01 , 2025 | 03:58 AM
బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక
నూతన సారథిగా నేడు అధికారిక ప్రకటన
కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడి దాకా..
4 దశాబ్దాల్లో అంచెలంచెలుగా ప్రస్థానం
విద్యార్థి నేతగా రాడికల్స్‌తో పోరు
నక్సల్స్ దాడితో 2 నెలలు మంచంపైనే..
1986 నుంచి అడ్వకేట్‌గా సేవలు
కార్పొరేటర్‌గా తొలిసారి పోటీ.. 2015లో ఎమ్మెల్సీగా ఎన్నిక
రాష్ట్రంలో అధికార పీఠమే లక్ష్యం!
స్థానిక సంస్థల ఎన్నికలే తొలి టార్గెట్
‘ఆంధ్రజ్యోతి’తో ఎన్.రాంచందర్‌రావు మేం అధికారంలోకి వస్తే బీసీనే సీఎం కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు రాష్ట్ర పార్టీ నూతన సారథిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధ్యక్ష పదవికి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. పార్టీ నూతన అధ్యక్షుడిగా రాంచందర్‌రావు పేరును సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా కరంద్లాజే మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఉదయం 10 గంటలకు మన్నెగూడలోని వేద కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ అధ్యక్ష, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. కాగా, అధ్యక్ష పదవి కోసం రాంచందర్‌రావు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తోపాటు ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్, సీనియర్ నాయకులు గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతున్న నేపథ్యంలో బీజేపీ ఇక జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టనుంది.
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్.రాంచందర్‌రావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే చాలామందికి తెలుసు. కానీ, విద్యార్థి రాజకీయాల్లో ఆయన రాడికల్స్‌కు ఎదురొడ్డి పోరాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రాంచందర్‌రావు అందులో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుంచి 1980 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ మూడేళ్లపాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రాంచందర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న సమయంలో నక్సలైట్లు ఏకంగా అక్కడికి వచ్చి ఆయనపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో దాదాపు రెండు నెలలపాటు ఆస్పత్రిలో మంచానికే పరిమితమైన రాంచందర్‌రావు ఆ తరువాత రాడికల్స్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసి పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఓవైపు ఉద్యమాలు చేస్తూనే ఎంఏ ఎల్‌ఎల్‌బీ (1982--85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977--85), నగర ఉపాధ్యక్షుడిగా ేసవలందించారు. 1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన రాంచందర్‌రావు.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రైబ్యునళ్లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసులను వాదిస్తుంటారు. బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రాంచందర్‌రావు ఎప్పుడూ ముందుంటారు.
కార్పొరేటర్‌గా తొలి పోటీ..
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో రాంచందర్‌రావు అంచెలంచెలుగా ఎదిగారు. 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్‌లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా తొలిసారిపోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ లీగల్ సెల్‌లో క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్‌గా, కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007-09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009-12), ముఖ్య అధికార ప్రతినిధిగా(2012-15) పనిచేశారు. 2015లో హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై 2021 వరకు బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. బీజేపీ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Latest Telangana News And Telugu News