Share News

Instagram Relationship: ఇదేం పని అమ్మా?

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:16 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ మహిళ అమ్మప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయస్సు ఉన్న తన కుమారుడిని బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ఆ యువకుడితో వెళ్లిపోయింది.

Instagram Relationship: ఇదేం పని అమ్మా?

  • కన్నకొడుకుని బస్టాండ్‌లో వదిలేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో వెళ్లిపోయిన తల్లి

  • గంటల వ్యవధిలో ఇద్దరినీ పట్టుకున్న నల్లగొండ పోలీసులు

  • తండ్రికి బాలుడి అప్పగింత

నల్లగొండ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ మహిళ అమ్మప్రేమకు మచ్చ తెచ్చే పని చేసింది. 15 నెలల వయస్సు ఉన్న తన కుమారుడిని బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ఆ యువకుడితో వెళ్లిపోయింది. నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. పోలీసుల అప్రమత్తతో ఆ చిన్నారి తండ్రి చెంతకు చేరాడు. నల్లగొండ టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన ఓ మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నల్లగొండలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణంలో పని చేసే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. తన 15 నెలల కుమారుడితో శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి నల్లగొండ బస్టాండ్‌కు చేరిన ఆ మహిళ.. తన ఇన్‌స్టా స్నేహితుడికి ఫోన్‌ చేసింది.


కాసేపటి తర్వాత కొడుకుని బస్టాండ్‌లోనే వదిలేసిన ఆ మహిళ.. ఆ యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లిపోయింది. తల్లి కనిపించకపోవడంతో ‘అమ్మా, అమ్మా’ అని ఏడుస్తూ ఆ బాలుడు బస్టాండ్‌లో తిరుగుతుండగా గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాలుడి తల్లి ఓ యువకుడితో ద్విచక్రవాహనంపై వెళ్లిపోవడాన్ని గుర్తించారు. ఆ ద్విచక్రవాహనం నెంబర్‌ ఆధారంగా వాహన యజమానికి ఫోన్‌ చేశారు. స్నేహితుడు తన వాహనాన్ని తీసుకెళ్లాడని ఆ యజమాని చెప్పడంతో అతని వద్ద మరిన్ని వివరాలు సేకరించారు. దీంతో బాలుడి తల్లిని, ఆ యువకుడిని శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళ భర్తకు సమాచారం ఇచ్చి ఆదివారం పోలీసుస్టేషన్‌కు రప్పించిన పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు. ఈ సందర్భంగా అందరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని మహిళ కుటుంబసభ్యులు చేసిన వినతి మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 07:58 AM