Share News

Nalgonda: అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమార్తె మృతి

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:53 AM

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుమార్తె గొంతుపై కత్తి గాయాలతో రక్తమడుగులో పడి ఉండగా, తల్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో గుర్తించారు.

Nalgonda: అనుమానాస్పద స్థితిలో తల్లీ కుమార్తె మృతి

  • రక్తమడుగులో కుమార్తె.. ఉరి వేసుకున్న స్థితిలో తల్లి

  • నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన

మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శనివారం తల్లి, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుమార్తె గొంతుపై కత్తి గాయాలతో రక్తమడుగులో పడి ఉండగా, తల్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న స్థితిలో గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆగ్రో కెమికల్స్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం విధుల్లో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లాడు.


శనివారం సాయంత్రం ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. ఇంట్లోని ఓ గదిలో అపస్మారక స్థితిలో ఉన్న తనపెద్ద కుమార్తె మధులత స్పృహలోకి వచ్చి తలుపు తెరచింది. మరో గదిలో తన భార్య రాజేశ్వరి (40) ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా, కుమార్తె వేదసాయిశ్రీ (12) గాయాలతో రక్తపుమడుగులో నిర్జీవంగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి, కూతురి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. రాజేశ్వరి తన చిన్నకూతుర్ని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేశ్వరి ఎడమచేతిపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - Apr 13 , 2025 | 03:53 AM