Raja Singh: బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నించడం లేదు
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:25 AM
తాను మళ్లీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని, అమిత్ షా తనకు ఫోన్ చేశారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.

నా రాజీనామా ఆమోదంలో పెద్ద కుట్ర: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తాను మళ్లీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని, అమిత్ షా తనకు ఫోన్ చేశారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తన రాజీనామాను అధిష్ఠానం ఆమోదించడంలో పెద్ద కుట్ర జరిగిందన్నారు. కొంత మంది దొరలు తన గురించి తప్పుడు సమాచారాన్ని ఢిల్లీ పెద్దలకు పంపారని ఆరోపించారు. తెలంగాణ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరిగిందో కేంద్రం పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మంచి రైటర్ అని.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలని రాజాసింగ్ పేర్కొన్నారు. తాను పదకొండేళ్లుగా పార్టీలో ఉన్నానని, మూడోసారి గెలిచినప్పటికీ మొదట ఎక్కడ ఉన్నానో ఇప్పుడూ అక్కడే ఉన్నానని తెలిపారు. చాలా బాధతో పార్టీని వీడానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై అధిష్ఠానం ఐబీతో నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరముందన్నారు.