Nizamabad: చిట్టీ వేసిన డబ్బులు తిరిగివ్వాలన్నందుకు మహిళ హత్య
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:19 AM
తన కు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యాపారి. ఆరు నెలల తర్వాత విషయం బయటపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

6 నెలల క్రితం గొంతునులిమి చంపి పూడ్చివేత
మోపాల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తన కు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యాపారి. ఆరు నెలల తర్వాత విషయం బయటపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మోపాల్‌కు చెందిన విజయ(45) వ్యవసాయ కూలీ. ఆమె భర్త విజయ్. వీరికి ఇద్దరు కుమారులు. విజయ్ దుబాయ్‌లో ఉండగా పంపిన డబ్బుల విషయంలో గొడవలు వచ్చి భార్యాభర్తలు విడి గా ఉంటున్నారు. మరోవైపు, మోపాల్‌కే చెందిన బుచ్చన్న అనే వ్యాపారి దగ్గర విజయ కొన్నేళ్ల పాటు చిట్టీ వేసింది. ఏడాది క్రితం చిట్టీ గడువు పూర్తయ్యాక.. తనకు రావాల్సిన డబ్బులు ఇచ్చేయాలని బుచ్చన్నను అడిగింది.
కానీ, బుచ్చన్న ఏడాది పాటు రేపిస్తా.. మాపిస్తా.. అంటూ తప్పించుకు తిరిగాడు. 6 నెలల క్రితం బుచ్చన్నపై విజయ గ్రామపెద్దల ముందు పంచాయతీ పెట్టించింది. దీంతో విజయపై కోపాన్ని పెంచుకున్న బుచ్చన్న.. చిట్టీ డబ్బులు ఇస్తానని జూలైలో ఆమెను ఇంటికి రమ్మన్నాడు. తన వద్ద పని చేసే నగేశ్ సహాయంతో విజయకు కల్లు తాగించి.. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. గ్రామ శివారులో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. విజయ కుమారుడు మనోహర్.. ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.