Singur Dam: సింగూరు డ్యాంను పరిశీలించిన అధ్యయన కమిటీ.. ఏం తేల్చిందంటే
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:53 PM
సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.
సంగారెడ్డి, నవంబర్ 22: సింగూరు ప్రాజెక్టు (Singur Project) మరమ్మతులపై ప్రభుత్వం (Telangana Govt) దృష్టి సారించిన విషయం తెలిసిందే. మరమ్మతుల కోసం ఇటీవల ఏడుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆనకట్ట మరమ్మతుల కోసం సింగూర్ డ్యాంను అధ్యయన కమిటీ ఈరోజు (శనివారం) పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది. అధ్యయన కమిటీలో ఓఎంసీ చైర్మెన్ అంజద్ హుస్సేన్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి , హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ ఉన్నారు.
ప్రాజెక్టు ఖాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధ్యయన కమిటీ చర్చించింది. సింగూరు ప్రాజెక్టులో నిల్వ ఉన్న 16 టీఎంసీల నీటిలో 6 టీఎంసీల నీటిని కిందకి వదిలి 10 టీఎంసీల నిల్వతో మరమ్మతులు చేసే యోచనలో నీటి పారుదల శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలపై సింగూర్ డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించి.. ఆపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతిన్నదని.. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ప్రమాదమని గతంలో నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికల నేపథ్యంలో మరమ్మతులకు రూ. 26 కోట్లు, ఇతర పనులకు రూ. 61.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.