Pashamylaram: పాశమైలారంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:43 PM
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి.. పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

సంగారెడ్డి, జూన్ 30: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి 12 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమ వారి ఆచూకీ తెలపాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిని పరిశ్రమలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, ఘటనా స్థలి వద్ద కుటుంబాల రోదనలు మిన్నంటాయి. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. అయితే గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. భారీ పేలుడు సంభవించడంతో ఆ ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. దీంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలిపోయింది. మరో భవనం బీటలు వారింది. ఇంకోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఉన్నతాధిరులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు.. ఈ పరిశ్రమ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.