Sheep scheme Scam ED: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు.. హైదరాబాద్‌లో 10 చోట్ల సోదాలు
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:38 AM
గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణాన్ని వెలికితీసేందుకు ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. అక్రమాలను బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్‌లో10 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్: గొర్రెల స్కాం కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడుగా ముందుకెళ్తోంది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Government) హయాంలో గొర్రెల పంపిణీ (Sheep Distribution)లో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో గతంలో ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది.
గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ స్కాం విలువ సుమారు రూ.700 కోట్ల వరకూ ఉంటుందని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధివిధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ప్రజలకు సుమారు రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ(ACB) తన దర్యాప్తులో గుర్తించింది.
గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హస్తమూ ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధి మంత్రమే కాంగ్రెస్‌ను గెలిపిస్తుంది..
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? జర జాగ్రత్త!
Read Latest Telangana News and National News