Karregutta : కర్రెగుట్టల్లో భారీ గుహ
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:48 AM
కర్రెగుట్టల్లో మావోయిస్టులు సేఫ్‌జోన్‌గా ఉపయోగించిన భారీ గుహలను బలగాలు గుర్తించాయి. ఈ గుహలు వెయ్యి మందికి గలగాలించేందుకు అనుకూలంగా ఉంటాయని, సహజ నీటివనరులు కూడా అక్కడ లభించాయంటున్నారు

సేఫ్‌జోన్‌గా వినియోగించిన నక్సల్స్
అర కి.మీ పొడవు.. సహజ నీటివనరులు
వెయ్యి మంది ఉండేందుకు అనుకూలం
బియ్యం, నిత్యావసర వస్తువుల గుర్తింపు
కర్రెగుట్టల్లో వందల గుహలు: ఆదివాసీలు
చర్ల, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): దుర్భేద్యమైన కర్రెగుట్టలను సేఫ్‌జోన్‌గా మలచుకున్న మావోయిస్టులు.. గుట్టల్లో ఉండే గుహలను ఆవాసాలుగా మలచుకున్నట్లు భద్రత బలగాలు గుర్తించాయి. శనివారం రాత్రి ఈ తరహాలో ఓ భారీ గుహను బలగాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఛత్తీస్‌గఢ్ వైపు.. పూజారీ కాంకేర్ నుంచి పలు అంచెలుగా కర్రె గుట్టలు దాటాక.. ఈ గుహ బయటపడ్డట్లు జవాన్లు తెలిపారు. ఓ గుట్ట అంచులో.. సుమారు అర కిలోమీటర్ మేర ఉన్న ఈ గుహ సుమారు వెయ్యి మంది తలదాచుకునేందుకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. ‘‘గుహలో వెలుతురు అస్సలు ఉండదు. కటిక చీకటి. పక్కనున్న మనిషిని కూడా పోల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. చెలమలతో సహజ నీటి నిల్వలు అక్కడక్కడా కనిపించాయి. 30-50 మీటర్ల ఎత్తుండే గుట్టలు చుట్టూ ఉంటాయి. దీని వల్ల వడగాల్పులు, భారీ వర్షాలు, చలిగాలుల ప్రభావం ఈ గుహపై పెద్దగా కనిపించదు. ఎండాకాలం కూడా గుహలో చల్లదనం ఉండడాన్ని గమనించాం’’ అని ఓ జవాను ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జవాన్లు గుహలోకి ప్రవేశించాక.. అక్కడ బియ్యం, ఇతర నిత్యావసరాలు ఉండడాన్ని గమనించారు. కూంబింగ్ తమను సమీపిస్తుండడంతో మావోయిస్టులు ఈ గుహను వదిలి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
వందలకొద్దీ గుహలు.. గుర్తించడం కష్టం!
సుమారు 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టల్లో వందల సంఖ్యలో గుహలు ఉన్నట్లు పూజారీ కాంకేర్ పరిసరాల్లోని ఆదివాసీలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కొన్ని గుహలు గుట్ట మొదట్లోనే ఉంటాయని, మరికొన్ని అంచుల్లో ఉంటాయని వివరించారు. ప్రస్తుతానికి జవాన్లు గుర్తించిన గుహ ఒక్కటే అయినా.. అలాంటివి వందల్లో ఉంటాయంటున్నారు. ‘‘గుహ అనగానే.. గుట్ట మధ్యలో చూడగానే కనిపించేట్లు ఉండదు. అతి సమీపానికి వెళ్లినా.. అక్కడ గుహ ఉన్నట్లు తెలియదు. గుట్టల పైనుంచి కిందకు వాలే తీగ మొక్కలు గుహను మూసివేస్తాయి. లోపల సూర్యరశ్మి కూడా సోకదు. కొన్ని గుహలు కిలోమీటరు పొడవు ఉంటాయి. వన్యప్రాణులు ఎక్కువగా ఇలాంటి గుహల్లో నివసిస్తాయి’’ అని స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి జవాన్లు గుర్తించిన గుహ కూడా ఇదే తరహాలో ఉండడం గమనార్హం..! కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించాక.. మావోయిస్టులు కర్రెగుట్టలను సేఫ్‌జోన్‌గా మలచుకున్నట్లు.. సెంట్రల్ కమిటీ నేతలు కూడా ఇక్కడ సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది.
అందాలే కాదు.. అడుగడుగునా అపాయం!
కర్రెగుట్టలో మనుగడ సాగించడం అంత సులభం కాదని స్థానికులు చెబుతున్నారు. ‘‘గుట్టల మధ్యలో చిత్తడి నేలలుంటాయి. పొడి నేలల మీదుగా వెళ్తున్నా.. అక్కడక్కడా మృత్యు కుహరాల్లా ఊబిలు ఉంటాయి. తాచుపాములు, ఇతర విషకీటకాలుంటాయి. అడవి కందిరీగలు కుడితే.. అవి కుట్టిన చోట మంటతోపాటు.. వాపు ఉంటుంది’’ అని స్థానిక ఆదివాసీలు వివరించారు. గత ఏడాది తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు ఇక్కడ వారం రోజులు కూంబింగ్ నిర్వహించి, చతికిలపడిపోయినట్లు పోలీసులు గుర్తుచేస్తున్నారు. కాళ్లు వాచిపోయి, నడవలేని స్థితికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ‘‘కర్రెగుట్టల్లో వాతావరణం ఉన్నపళంగా మారిపోతోంది. మండుటెండ, ఉక్కబోత ఉంటుంది. కాసేపటికే అకస్మాత్తుగా వర్షాలు కురుస్తాయి. గురువారం 15మంది జవాన్లు వడదెబ్బకు గురవ్వగా.. శని, ఆదివారాల్లో పలువురు జవాన్లు డీ-హైడ్రేషన్‌కు గురయ్యారు. అయితే.. సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిశాయి’’ అని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య
Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు
AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..
Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం
Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి
TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు
BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..
For Telangana News And Telugu News