Share News

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

ABN , Publish Date - May 22 , 2025 | 03:51 AM

ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

  • దళపతిని కోల్పోయిన మావోయిస్టులు

  • ఒక్క ఏడాదిలోనే 540 మంది ఎన్‌కౌంటర్‌

  • ఖాళీ అయిన దండకారణ్య స్పెషల్‌ జోన్‌

  • ఉనికిని కోల్పోయిన ఏవోబీ కమిటీ

(అమరావతి- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

భారత విప్లవోద్యమ చరిత్రలో తొలిసారి మావోయిస్టులు తమ దళపతిని ఎన్‌కౌంటర్‌లో కోల్పోయారు. కేంద్రం సాగిస్తున్న సాంకేతిక యుద్ధంతో ఏడాది కాలంగా విలవిల్లాడుతున్న మావోయిస్టులకు ఇది శరాఘాతమే.! వెన్ను విరిగినట్టే! మే నెల మావోయిస్టు పార్టీ ఉనికికి కీలకమైనది. మరో నాలుగు రోజుల్లో, అంటే ఈ నెల 25న నక్సల్బరీ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది. అలాంటి మే నెలలోనే నక్సల్స్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్‌లో జరిగిన హోరాహోరీ ఎదురు కాల్పుల్లో బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. ఈ సంఘటన మావోయిస్టుల ఏరివేత యుద్ధం చేస్తున్న కేంద్ర సాయుధ బలగాలకు పెద్ద విజయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ‘ఎక్స్‌’లో ప్రకటించారు. బస్వరాజ్‌ మరణం మావోయిస్టు పార్టీకి ఎంత నష్టం అనేదానికి ఈ ప్రకటనే సాక్ష్యం. మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ అంటేనే నిర్ధేశిత వ్యవస్థ. ఆ కమిటీకి ప్రధాన కార్యదర్శి అంటే గుండెకాయ. కేంద్ర బలగాలు ఆ గుండెకాయను మట్టుబెట్టాయి. కేంద్రం 2026 మార్చి నాటికి మావోయిస్టులును లేకుండా చేస్తానని ప్రకటించింది. ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది. కానీ, గడువుకు చాలా ముందే, ఇంత త్వరగా కేంద్రం కమిటీ కార్యదర్శి, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ నేతలు అనేక మంది ఒకే ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడం భద్రతాబలగాల ఆధిపత్యాన్ని నిరూపిస్తోంది.


హడలెత్తిస్తున్న హైటెక్‌ వార్‌...

2024లో ఆపరేషన్‌ కగార్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మరణించారు. టాప్‌ నాయకత్వం నుంచి జిల్లా కమిటీ సభ్యుని దాకా మరణించినవారిలో ఉన్నారు. యూపీఏ హయాంలో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌లో భాగంగా సగటున ఏడాదికి 80 మంది మావోయిస్టులు మరణించేవారు. ఇప్పుడు ఆపరేషన్‌ కగార్‌ అందుకు భిన్నంగా సాగుతోంది. ఒక విధంగా అత్యాధునిక సాంకేతిక యుద్ధం సాగుతోంది. వేలాది పారామిలటరీ బలగాలు, రాష్ట్ర ప్రత్యేక బలగాలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి, అడవులను జల్లెడ పట్టేందుకు హైటెక్‌ విధానాలను అనుసరిస్తున్నారు. మానవ రహిత డ్రోన్లను వాడి విజయాలు సాధిస్తున్నారు. దండకారణ్యంలో ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ మంది కదలికలు ఉన్నా, ఆయుధాలు, ఇతర సామగ్రిని సైతం కనిపెట్టి భద్రతా బలగాలకు వాటి లొకేషన్‌తో కూడిన వివరాలను మ్యాప్‌లతో సహా అందించే అత్యాధునిక వార్‌ కేటగిరీ సైలెంట్‌ కిల్లర్‌ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. అవి ఒకటో, రెండో కాదు. మావోయిస్టులకు పట్టున్న అబూజ్‌మడ్‌, నారాయణపూర్‌, బీజాపూర్‌, కాంకేర్‌, ఆంధ్రా-ఒడిసా బోర్డర్‌.....ఇలా ఆయా ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి లెక్కకు మించిన డ్రోన్లను రోజువారీగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల భద్రతా బలగాలు అడవుల్లోని భారీ కొండలు, గుట్టలు ఎక్కి, దిగాల్సిన పనిలేదు. అనుమానంతో ఓ డ్రోన్‌ను ప్లైయింగ్‌ చేపిస్తే 18-25 కిలోమీటర్ల పరిధిలోని అడవిలో ఎక్కడ ఏం ఉందో సులువుగా కనిపెట్టవచ్చు. ఇవి భద్రతా బలగాల చేతికి అందిన తర్వాతే గత ఏడాది కాలంగా ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరిగిపోయింది. సగటున ఒక్కో సంఘటనలో 20 -30 మంది చొప్పున మరణిస్తున్నారు. మానవ రహిత డ్రోన్లు అడవుల్లో ఉన్న మావోయిస్టుల జాడను లోకేషన్‌తో సహా ఇస్తుండటంతో వారున్న ప్రాంతాలను బలగాలు రెండు లేదా మూడు గంటల వ్యవధిలోనే చుట్టుముడుతున్నాయి. డ్రోన్‌ సర్వెలైన్స్‌ ఇచ్చే డేటాతో ఒకేసారి వేలాది మంది భద్రతా బలగాలు మావోయిస్టులపై దాడులు చేస్తున్నాయి. దీంతో మావోయిస్టుల వైపు ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటోంది.


షెల్టర్‌ జోన్‌లలోకి తిరోగమనం..

వరుస ఎన్‌కౌంటర్లతో గడ్డు పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్రంతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ రెండుసార్లు శాంతిచర్చల ప్రతిపాదన చేశారు, కేంద్రం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించలేదు సరికదా...మావోయిస్టు గెరిల్లాలకు ఆశ్రయమైన కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడ పట్టించింది. ఇక చర్చలకు కేంద్రం అవకాశం ఇవ్వదని మావోయిస్టు పార్టీకి సంకేతాలు వెళ్లాయి. వార్‌ జోన్‌ నుంచి షెల్టర్‌ జోన్‌కు వెళ్లాలని పార్టీ ముఖ్యనేతలకు కేంద్ర కమిటీ నుంచి సూచనలు వెళ్లినట్లుగా ఇటీవలి తనిఖీల్లో వెలుగుచూసిన పలు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది.

ఖాళీ అవుతున్న కమిటీలు..

గత ఏడాది సెప్టెంబరు నాటి మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్‌ ప్రకారం కేంద్ర కమిటీ సభ్యులు 21 మంది. పొలిట్‌బ్యూరో సభ్యులు 13మంది. కానీ తాజా పరిణామాలతో కమిటీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మావోయిస్టు పార్టీకి దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) కీలకమైనది. ఇందులో నుంచే అనేక మంది కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది కాలంగా ఈ కమిటీలో 18 మంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఉప కమిటీల పరిధిలో 120 మంది మరణించారు. దీంతో దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ దాదాపుగా ఖాళీ అయినట్లేనని పోలీసువర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో కేరళలోనే ఆ పార్టీకి కొంత పట్టు ఉంది. గత ఏడాది జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ఇద్దరు రాష్ట్రకమిటీ సభ్యులు అక్కడ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఏపీ, తెలంగాణల్లో ప్రత్యేకంగా దళాలు లేని పరిస్థితి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కమిటీలో 18 మంది కీలక నేతలు ఉన్నా వ్యక్తులుగానే ఉన్నారని సమాచారం. వరుస ఎన్‌కౌంటర్ల నేపఽథ్యంలో ఏఓబీ కమిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చిందని ప్రజాసంఘాలు చెబుతున్నాయి.


వేధిస్తున్న వయో భారం

మావోయిస్టులను వేధిస్తున్న మరో సమస్య వయోభారం. పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనాయకుల్లో ఎక్కువ మంది 60 నుంచి 75 ఏళ్ల మధ్యలో ఉన్నారు. వీరిలో చాలామంది వయోభారంతో, అనారోగ్యాలతో కదల్లేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన అగ్రనాయకత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితి వారికి ఏర్పడింది. 2010 ప్రాంతాల్లో 96 జిల్లాల్లో బలమైన ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ 2023 నాటికి 46 జిల్లాలకు పరిమితమైంది. ఆపరేషన్‌ కగార్‌ తర్వాత ఆరు జిల్లాలకే పరిమితమైంది.

ఎందుకీ పరిస్థితి?

ఒకప్పుడు నక్సల్స్‌కు అడవులు సురక్షితమైనవి. అడవుల్లో ఉంటూనే దళాల నిర్మాణం చేసి విముక్తి ప్రాంతాలను ప్రకటించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో యాక్షన్‌లు చేపట్టేందుకు టీమ్‌లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. అయితే టెక్నాలజీ పెద్దగా లేని సమయంలో నక్సల్స్‌ ఏరివేతకు పోలీసు బలగాలు ప్రధానంగా మేధస్సును నమ్ముకొని పనిచేశాయి. కోవర్ట్‌ సిస్టమ్‌ను డెవలప్‌ చేసి కీలకనేతలను మట్టుబెట్టారు. అడవుల్లోకి వెళ్లి నక్సల్స్‌ను తుదముట్టించాలని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పార మిలటరీ బలగాలను రంగంలోకి దింపి ప్రత్యేక చర్యలు చేపట్టాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు అత్యాధునిక ఆయుధాలు వినియోగించింది. చీకట్లో కూడా నక్సల్స్‌ను గుర్తించేందుకు నైట్‌విజన్‌ గ్లాసె్‌సను వినియోగించింది. ఆ తర్వాత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంది. మావోయిస్టుల ఏరివేతకు సాధారణ డ్రోన్లను ఉపయోగించారు. వాటిని నక్సల్స్‌ కూల్చివేశారు. కానీ 2023 నుంచి అత్యాధునికమైన మానవ రహిత, శ బ్దరహిత యుద్ధడ్రోన్లను మావోయిస్టు ఆపరేషన్స్‌కోసం కేంద్రం ఉపయోగిస్తోంది. ఒకవైపు పెరిగిన నిర్బంధం, మరోవైపు డ్రోన్‌దాడులు, ఆధునిక యుద్ధాన్ని ఎదుర్కోలేక ఇంకా సంప్రదాయ కాలి నడక మార్గాల్లోనే పయనిస్తూ మృత్యువులోకి వెళ్లిపోతున్నారు. అసలు అడవుల్లోనే ఉంటూ మావోయిస్టు సాయుధుడిగా ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? అన్నది ఇప్పుడు మావోయిస్టు పార్టీ ముందున్న అతిపెద్ద సవాల్‌. కేంద్రం కోరుతున్నట్లుగా మావోయిస్టులు అస్త్రసన్యాసం చేసి సాయుధంగా లొంగిపోలేరు. అలాగని అడవుల్లోనే ఉంటూ పాత పద్ధతులు, కాలం చెల్లిన వ్యూహాలతో సాయుధపోరాటం అంటే విడతల వారీగా మృత్యువును ఆహ్వానించడమే అవుతుంది.


టాప్‌ ఆర్డర్‌ కూలిందిలా..

బెంగాల్‌లోని నక్సల్బరీలో 1967 మే 25న మొదలైన సాయుఽధ రైతాంగ తిరుగుబాటును అసలైన మార్గంగా గుర్తించినవారిని నక్సల్స్‌గా వ్యవహరిస్తున్నారు. 1968లో వీరంతా చారుమజుందార్‌ నాయకత్వాన్ని అంగీకరించి, ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా సీపీఐ(ఎం.ఎల్‌.) పార్టీని ఏర్పాటుచేశారు. ఉమ్మడి ఏపీ నుంచి పంచాది కృష్ణమూర్తి కేంద్ర కమిటీ సభ్యునిగా ఉండేవారు. ఆ తర్వాత ఎన్‌ఔంటరులో ఆయన మరణించారు. చారుమజుందార్‌ పోలీసులకు పట్టుబడి 1972 జూలై 28న కస్టడీలో చనిపోయారు. పోలీసుల అదుపులో ఉండగా ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి మరణించిన తొలి సంఘటన అది. ఆ తర్వాత జరిగిన అతిపెద్ద సంఘటన బస్వరాజ్‌ ఎన్‌కౌంటరే. 1980లో పీపుల్స్‌వార్‌ ఏర్పడే నాటికి సీపీఐ(ఎం.ఎల్‌.)గా ఉన్న పార్టీలో అనేక మంది సాయుధపోరాట పంథాలో సాగారు. కానీ పార్టీకి సారఽథ్యం వహిస్తున్నవారెవ్వరూ ఎన్‌కౌంటర్లలో మరణించలేదు. పీపుల్స్‌వార్‌ 1980లో కొండపల్లి సీతరామయ్య నేతృత్వంలో ఆవిర్భవించిన తర్వాత అనేక రాష్ట్ర కమిటీ నేతలు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఉమ్మడి ఏపీలో గ్రేహౌండ్స్‌ బలగాల ఆపరేషన్స్‌లో రాష్ట్ర కార్యదర్శి పులిఅంజయ్య, ఆ తర్వాత మాధవ్‌ చనిపోయారు. 1999 డిసెంబరులో పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 2004లో పీపుల్స్‌వార్‌ దండకారణ్యంలోని ఎంసీసీతో విలీనం తర్వాత సీపీఐ(మావోయిస్టు) పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 2009లో కేంద్రం మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి కీలక నేతల ఎన్‌కౌంటర్లు సెలక్టీవ్‌గా జరిగాయి. ఆజాద్‌ (చెరుకూరి రాజ్‌కుమార్‌), కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు), పటేల్‌ సుధాకర్‌రెడ్డి(సూర్యం), శాఖమూరి అప్పారావు వంటి అనేక మంది కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఆపరేషన్‌ కగార్‌లో వరస ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌- ఒరిశా సరిహద్దుల్లో గరియాబంద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మరణించారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ కమిటీ కీలక నేత రాంజీ మరణించారు. ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్‌నే కోల్పోయారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తప్పుకొన్న తర్వాత బాధ్యతలు స్వీకరించిన కేశవరావు ఉత్తరాది, దక్షిణాది మావోయిస్టు దళాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపారు. మావోయిస్టు పార్టీని దేశమంతటా విస్తరించడంలో ప్రధానపాత్ర పోషించారు. కరోనా కాలం కూడా మావోయిస్టులను భయపెట్టింది. తెలంగాణ కార్యదర్శి హరిభూషన్‌ కరోనాతో ఉద్యమంలోనే మరణించారు. కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్‌కౌంటరులో మరణించిన నల్లా ఆదిరెడ్డి భార్య సరోజినిని కరోనా బలి తీసుకుంది.

Updated Date - May 22 , 2025 | 04:12 AM