Manda Krishna: వర్గీకరణను అడ్డుకుంటోంది వివేక్ వెంకటస్వామే..
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:06 AM
రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకుంటోంది వివే క్ వెంకటస్వామితో పాటు మరికొందరు మాల నాయకులేనని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

7న ‘లక్ష డప్పులు వెయ్యి గొంతుల’తో సత్తా చాటుతాం: మందకృష్ణ మాదిగ
బర్కత్‌పుర/ పంజాగుట, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్గీకరణను అడ్డుకుంటోంది వివే క్ వెంకటస్వామితో పాటు మరికొందరు మాల నాయకులేనని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మారుస్తున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌మీట్‌లో అనంతరం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, శ్రీ విద్యాశక్తిపీఠం, వైదిక బ్రాహ్మణ సంఘం, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘం, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో మందకృష్ణ మాట్లాడారు.
వర్గీకరణకు తాము అనుకూలమని సీఎం రేవంత్ హామీ ఇచ్చి 4 నెలలైందని, అయినా ఇప్పటివరకు ఒక్క అడుగూ ముం దుకు పడలేదన్నారు. ఈ విషయంలో ఇక ఆగేది లేదని తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 7న ‘లక్ష డప్పులు వెయ్యి గొంతుల’తో మాదిగల సత్తా చాటబోతున్నట్లు చెప్పారు. మాదిగ దండోరా ఏ కులానికో, మతానికో పరిమితం కాదన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ, వైశ్యులు రాజకీయ వివక్షకు గురవుతున్నారని, యాదవ-కురుమ సామాజిక వర్గాల మధ్య కూడా అన్యాయం జరుగుతోందని తెలిపారు. తెలుగు నేలపై మాదిగల పోరాటాలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని, దీనిని వేరే విధంగా చూడవద్దని కోరారు. తనకు పద్మశ్రీ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో పరమార్థం ఏమిటో అంతుచిక్కట్లేదని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్