Share News

Caste Group Violence: వాట్సాప్‌ గ్రూప్‌లో ఎమోజీ పెట్టాడని.. ఓ వ్యాపారిని కొట్టిచంపిన వ్యక్తులు

ABN , Publish Date - Jul 23 , 2025 | 04:28 AM

ఓ కుల సంఘానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఉప్పు-నిప్పుగా ఉన్న ఇద్దరిలో ఒకరు పెట్టిన

Caste Group Violence: వాట్సాప్‌ గ్రూప్‌లో ఎమోజీ పెట్టాడని.. ఓ వ్యాపారిని కొట్టిచంపిన వ్యక్తులు
Caste Group Violence

  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోరం

సూర్యాపేట క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఓ కుల సంఘానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో ఉప్పు-నిప్పుగా ఉన్న ఇద్దరిలో ఒకరు పెట్టిన పోస్టుకు మద్దతుగా చప్పట్లతో కూడిన ఎమోజీ పెట్టడమే అతడు చేసిన తప్పయింది! ఎమోజీ ఎందుకు పెట్టావంటూ గ్రూపులోని వ్యక్తి కన్నెర్ర చేయడంతో మొదలైన గొడవ.. చివరికి అతడి హత్యకు దారితీసింది. సూర్యాపేటలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట పద్మశాలి సంఘం ఎన్నికలను ఆగస్టు 3న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20న నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. పద్మశాలి సంఘ పట్టణ అధ్యక్ష పదవికి శ్రీరాముల రాములు నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం ఆ సంఘానికి పట్టణ అధ్యక్షుడిగా అప్పం శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. ‘సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో రాములు, శ్రీనివాసులు ఏడాదిగా వివిధ పోస్టులు పెట్టుకుంటున్నారు. రాములు తనపై వాట్సాప్‌ గ్రూప్‌లో చేస్తున్న ఆరోపణలకు శ్రీనివాస్‌ ఈ నెల 21న పూర్తిస్థాయిలో బదులిచ్చారు. శ్రీనివాస్‌ పెట్టిన పోస్టులకు మద్దతుగా పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన హోల్‌సేల్‌ చెప్పుల వ్యాపారి మానుపురి కృపాకర్‌ (54) చప్పట్లతో కూడిన ఎమోజీని పోస్టు చేశారు. దీనిని చూసి రాములు ఆగ్రహంతో కృపాకర్‌కు ఫోన్‌ చేసి దూషించారు. ఈ విషయాన్ని కృపాకర్‌, శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లారు. విషయం ఎన్నికల ప్రతినిధులకు తెలపాలని ఆయన సూచించటంతో, కృపాకర్‌ మంగళవారం ఉదయం పద్మశాలి సంఘం భవనానికి వెళ్లారు. జరిగిన విషయం చెబుతుండగానే రాములు, ఆయన కుమారుడు ధనుంజయ్‌, మరికొందరు కృపాకర్‌ను దూషిస్తూ దాడి చేశారు. ఈ దాడిలో కృపాకర్‌కు అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో స్పహకోల్పోయారు. ఆయన్ను అక్కడున్నవారు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కృపాకర్‌ భార్య ఫిర్యాదు మేరకు రాములు, ఆయన కుమారుడు ధనుంజయ్‌తో పాటు రాములు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 04:28 AM