Share News

Khammam: ఆరేళ్లు సహజీవనం చేసి.. హతమార్చాడు!

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:22 AM

పిల్లలు పుట్టడం లేదని కట్టుకున్న భార్యను వదిలేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలున్న, భర్త నుంచి విడిపోయిన మహిళతో సహజీవనం ప్రారంభించాడు. ఆపై మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Khammam: ఆరేళ్లు సహజీవనం చేసి.. హతమార్చాడు!

  • ఇద్దరికి లక్ష సుపారీ ఇచ్చిన మదన్‌

  • ఖమ్మం జిల్లా కొణిజర్ల నుంచి తీసుకెళ్లి

  • సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో హత్య

  • మహిళ అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ

  • కిష్టాపురం అడవుల్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం

  • సహజీనవం చేస్తూ మరొకరితో మదన్‌ పెళ్లి.. ఇద్దరితో ఒకే ఇంట్లో

కొణిజర్ల/చింతలపాలెం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పిల్లలు పుట్టడం లేదని కట్టుకున్న భార్యను వదిలేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలున్న, భర్త నుంచి విడిపోయిన మహిళతో సహజీవనం ప్రారంభించాడు. ఆపై మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దర్నీ ఒకే ఇంట్లో ఉంచి కాపురం చేస్తున్న క్రమంలో వారి మధ్య గొడవలతో సహజీవనం చేస్తున్న మహిళను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. దాని కోసం ఇద్దరు వ్యక్తులకు రూ.లక్ష సుపారీ ఇచ్చి వారి సాయంతో ఆమెను హతమార్చాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం విక్రంనగర్‌ నుంచి కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఆమె కేసు వెనుక మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామ శివారులోని అటవీ భూముల్లో గుర్తించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా సీఐ ఎన్‌..సాగర్‌, ఎస్‌ఐ జి.సూరజ్‌ వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన భూక్యా మదన్‌కు ఏన్కూరు మండలానికి చెందిన మహిళతో సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో పెళ్లయిన నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత టేకులతండాకు చెందిన భూక్యా హస్లీ (40)తో పరిచయం పెరిగింది. హస్లీ అప్పటికే భర్త నుంచి విడాకులు పొందింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా.. రెండో కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. మదన్‌, హస్లీ కొణిజర్ల మండలం విక్రంనగర్‌లో బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆరేళ్లుగా వారి సహజీవనం కొనసాగుతుండగా... మూడేళ్ల క్రితం మదన్‌ కొణిజర్ల మండలంలోనే అబ్జల్‌తండాకు చెందిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా హస్లీతో ఉంటున్న ఇంటికే తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా వారిద్దరికి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. దీంతో మదన్‌ హస్లీని అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు.


women.jpg

తమ్మిశెట్టి నరసింహారావు (కొణిజర్ల మండలం బస్వాపురం), చల్లా నాగేశ్వరరావు (కొణిజర్ల)ను సంప్రదించాడు. హస్లీని హతమార్చేందుకు సహకరించాలని, రూ.లక్ష సుపారీ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 6న మదన్‌.. హస్లీకి మాయమాటలు చెప్పి కిరాయి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నరసింహారావు, నాగేశ్వరరావును కూడా కొణిజర్ల వద్ద ఆటోలో ఎక్కించుకొని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కిష్టారం అడవుల వద్దకు తీసుకెళ్లాడు. కిరాయికి వచ్చిన ఆటో వెళ్లిపోయిన తర్వాత హస్లీకి బలవంతంగా విషం తాగించి.. గొంతునులిమి హత్య చేశారు. తర్వాత ఎవరికి వారు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే హస్లీ కూతుళ్లకు తరచూ ఫోన్‌ చేస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటోంది. తమ తల్లి నాలుగు రోజులుగా ఫోన్‌ చేయకపోవడంతో కూతుళ్లు ఆందోళన చెందారు. తమ తల్లి ఆచూకీ తెలియడం లేదని ఈ నెల 11న కొణిజర్ల పొలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కొణిజర్ల పొలీసులు మదన్‌ తీరుపై అనుమానం వచ్చి ప్రశ్నించడంతో హత్య విషయం బయటపడింది. సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి వెళ్లగా కుళ్లిన స్థితిలో ఉన్న హస్లీ మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మదన్‌ను అదుపులోకి తీసుకోగా నరసింహారావు, నాగేశ్వరరావు పరారీలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వికసిత్‌ తెలంగాణ బీజేపీకే సాధ్యం

రాజకీయ న్యాయానికి భరోసా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 07:38 AM