Mallu Ravi: కేటీఆర్.. దొరికిన దొంగ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:32 AM
అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మతిస్థిమితం కోల్పోయి సీఎం రేవంత్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిబంధనలను ఉల్లంఘించి రూ.55కోట్ల ప్రజా ధనాన్ని విదేశీ కంపెనీలకు ఇచ్చి ఇప్పుడు నిజాయితీపరుడిలాగా మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. తప్పు చేయకపోతే నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. ఫార్ములా-ఈ రేసింగ్‌లో నిధుల దుర్వినియోగం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ విచారణ కైనా సిద్థం అని చెప్పిన కేటీఆర్.. విచారణను అడ్డుకోవాలని ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి లొట్టపీసు కేసు.. లొట్టపీసు సీఎం అని మాట్లాడవచ్చా? అని నిలదీశారు. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు.
నీటిపారుదల శాఖలోనూ బావ, బామ్మర్దులు(హరీశ్, కేటీఆర్) అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నాడు మంత్రిగా కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎ్‌సలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫార్ములా-ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు స్పష్టమవుతోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఏ కోర్టులో ఊరట రావటం లేదంటే....తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నట్టే కదా? అని అన్నారు. చేసిన తప్పులకు కేటీఆర్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. లుచ్చా పనులు చేసి విచారణకు వెళ్తున్న కేటీఆర్ లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య విమర్శించారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచానని ఇంకా పొంకణాలు కొడుతున్నాడని మండిపడ్డారు. అర పైసా అవినీతికి పాల్పడలేదని చెబుతున్న కేటీఆర్.. అనుమతి లేకుండారూ.55 కోట్లు ఎలా పంపించాడని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.