మత్తుమందుల సరఫరా ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:39 AM
మహారాష్ట్రలోని థానే నుంచి తెలంగాణలోని కల్లు దుకాణాలకు మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది.

నిర్మల్ సమీపంలో ఐదుగురు అరెస్టు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని థానే నుంచి తెలంగాణలోని కల్లు దుకాణాలకు మత్తు మందు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, నిర్మల్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో రూ.52 లక్షల విలువైన 1.15 కిలోల ఆల్ర్ఫా జోలం, 425 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనంతోపాటు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కల్లులో కలిపే మత్తు మందులను రవాణా చేస్తున్న కేసులో గత ఏడాది అరెస్టయిన రామాగౌడ్.. బెయిల్‌పై బయటకొచ్చాక తన మకాం థానేకు మార్చాడు. అక్కడ నుంచే క్లోరల్ హైడ్రేట్, అల్ర్ఫాజోలంలను కల్లు దుకాణాలకు సరఫరా చేయడం ప్రారంభించాడు.
ఈ విషయమై పక్కాగా అందిన సమాచారంతో రంగంలోకి దిగిన తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. నిర్మల్ పట్టణానికి సమీపంలో చిట్యాల వద్ద ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి.. చేపట్టిన తనిఖీల్లో రెండు కార్లలో క్లోరల్ హైడ్రేట్, అల్ర్ఫా జోలం స్వాధీనం చేసుకున్నారు. రామాగౌడ్‌తోపాటు కరీంనగర్ వాసులు బుర్రా రమేష్, కోటగిరి రాజాం, ఎల్లందుల శ్రీనివాస్, బుర్రా రాజశేఖర్‌లను అరెస్టు చేశామని సందీప్ శాండిల్య తెలిపారు. ఎక్కడైనా మత్తు మందు రవాణా చేసినా, ఉపయోగించినా 87126 71111 నంబర్‌కు తెలపాలని కోరారు.