Manchirevula Leopard: మంచిరేవులలో చిక్కిన చిరుత
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:26 AM
గత 20 రోజులుగా మంచి రేవుల ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది.

ట్రెక్ పార్కు నుంచి జూపార్కుకు తరలింపు
నార్సింగ్/హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): గత 20 రోజులుగా మంచి రేవుల ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం రాత్రి చిరుత చిక్కింది. గురువారం ఉదయం అటవీ సిబ్బంది చిరుతపులిని జూపార్కుకు తరలించారు. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారంతో జనం భయాందోళనలో ఉన్నారు. దానిని పట్టుకునేందుకు అటవీ అధికారులు ఏడు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రెండుసార్లు పలు ప్రాంతాల్లో కెమెరాలకు చిక్కిన చిరుత మరోసారి గోల్కొండ ఆర్మీ ప్రాంతంలో రికార్డయింది. ఈసారి ఎలాగైనా చిరుతను పట్టుకోవాలని పథకం రచించిన అటవీ అధికారులు ట్రెక్ పార్కులో బోను ఏర్పాటు చేసి అందులో మేకను ఉంచారు. మేక అరుపులకు అక్కడికి వచ్చిన చిరుత బోనులో చిక్కింది.
జనం అప్రమత్తంగా ఉండాలి: అటవీ శాఖ
హైదరాబాద్ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలు తగ్గడం, అడవుల్లో సరైన ఆహారం దొరక్కపోవడంతో చిరుతలు బయటకు వస్తున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సువర్ణ తెలిపారు. పులులు దాడులు చేసే అవకాశం ఉన్నందున జనం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచిరేవుల వద్ద చిక్కిన మగ చిరుతపులి వయసు 5 నుండి 6 ఏళ్లు ఉండొచ్చని తెలిపారు. చిరుతపులుల సంచారాన్ని గమనిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబరు 040-23231772 కు ఫోన్ చేయాలని సీనియర్ అధికారి శంకరన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News