Share News

Kukatpally: భయపెడుతున్న వీధి కుక్కలు.. నెల రోజుల్లో 758 కేసులు

ABN , Publish Date - Nov 11 , 2025 | 09:55 AM

కూకట్‌పల్లి నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా స్థానికులను వెంటాడి కరుస్తున్నాయి.

Kukatpally: భయపెడుతున్న వీధి కుక్కలు.. నెల రోజుల్లో 758 కేసులు

- కూకట్‌పల్లి నియోజకవర్గంలో నెల రోజుల్లో 758 కుక్కకాటు కేసులు

- రోడ్లపై తిరగాలంటే భయపడుతున్న ప్రజలు

- పిల్లల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

- నియంత్రణ చర్యలు చేపట్టని అధికారులు

కూకట్‌పల్లి(హైదరాబాద్): కూకట్‌పల్లి నియోజకవర్గం(Kukatpally Constituency)లో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా స్థానికులను వెంటాడి కరుస్తున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పీహెచ్‌సీల్లో గత నెల రోజుల్లో 758 మందికి కుక్కకాటు ఇంజక్షన్‌లు ఇచ్చారు. ప్రతిరోజూ 20కి పైగా కుక్కకాటు బాధితులు ఒక్క బాలానగర్‌ పీహెచ్‌సీ పరిధిలోనే ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉందో లెక్కలు చూస్తే అర్థమవుతుంది.


కార్మికులపై దాడి..

కూకట్‌పల్లి, బాలానగర్‌, మూసాపేట(Kukatpally, Balanagar, Moosapet)తో పాటు పలు డివిజన్‌లలో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణ అధికారులు కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్‌ చేసి తిరిగి వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండటం లేదు. బాలానగర్‌లో ఆదివారం ఉదయం రోజులాగే పారిశుధ్య పనిచేస్తున్న సమయంలో మానసికంగా బాగాలేని వీధి కుక్క ఒక్కసారిగా కార్మికులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయానికి కారణమైన కుక్కను కుక్కల నియంత్రణ అధికారులు అదేరోజు సాయంత్రం పట్టుకున్నారు. కార్మికులకు యాంటీ రేబీస్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు.


zzzz.jpg

చిన్నపిల్లల పరిస్థితిపై ఆందోళన..

రోడ్లపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు దగ్గరకు వచ్చి దాడులు చేస్తున్నాయి. పెద్దలు కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఒక్కోసారి కుక్కకాటు నుంచి తప్పించుకోలేదు. మరి చిన్నపిల్లల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


city6.jpg

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇలా..

వీధి కుక్కల దాడుల విషయంలో ఇటీవలే సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో వీధి కుక్కలను నియంత్రించాలని అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ విషయమై కూకట్‌పల్లి వెటర్నరీ డాక్టర్‌ దీపాంకర్‌ను వివరణ కోరగా ఇప్పటికే విద్యా సంస్థలు, జిమ్‌లు, ఆస్పత్రులు, బస్టాండ్‌ తదితర ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్లు తెలిపారు.


కుక్కకాటును నిర్లక్ష్యం చేయొద్దు

కూకట్‌పల్లిలోని పలు పీహెచ్‌సీలలో కుక్కకాటు ఇంజక్షన్‌లు అందుబాటులో లేకపోవడంతో అందరికి ఇక్కడే ఇంజక్షన్‌లు ఇస్తున్నాం. అక్టోబరు మాసంలో 758 మందికి ఇంజక్షన్‌లు ఇచ్చాం. నవంబరులో 7వ తేదీ వరకు 194 ఇంజక్షన్‌లు ఇచ్చాం. కుక్కకాటును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని టీకా వేయించుకోవాలి. 3, 7, 28 రోజుల్లో టీకాలు తప్పకుండా తీసుకోవాలి.

- డాక్టర్‌ పద్మావతి, బాలానగర్‌ పీహెచ్‌సీ


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 11 , 2025 | 10:02 AM