Share News

BRS Social Media Activist: నల్లబాలు ఇంటికి కేటీఆర్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:06 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని, బెదరింపులకు భయపడవద్దని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

BRS Social Media Activist: నల్లబాలు ఇంటికి కేటీఆర్‌

  • ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు బెదిరింపులకు భయపడవద్దు

  • శశిధర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న కేటీఆర్‌

  • కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు

రామచంద్రాపురం టౌన్‌/మర్కుక్‌/హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని, బెదరింపులకు భయపడవద్దని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధి పోచారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా కార్యకర్త శశిధర్‌గౌడ్‌ (నల్లబాలు) ఇంటికి కేటీఆర్‌ వచ్చా రు. సామాజిక మాధ్యమంలో సర్కారుకు వ్యతిరేకం గా పోస్టులు పెట్టారంటూ ఇటీవల శశిధర్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా శశిధర్‌గౌడ్‌ ఇంటికి వచ్చిన కేటీఆర్‌.. ఆయనతో పాటు భార్య స్ఫూర్తి, తల్లి విజయలక్ష్మిలతో మాట్లాడారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రజాసమస్యలపై స్పం దించిన వారిపై కేసులు పెట్టి, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించాలని, అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. కేటీఆర్‌ వెంట ఎమ్మెల్యే వివేకాందనగౌడ్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులున్నారు.


తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్‌

పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌ తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, కేసీఆర్‌, తల్లి శోభమ్మ ఆశీస్సులు అందుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేటీఆర్‌.. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌.. కేటీఆర్‌ను ఆలింగనంచేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలోని తాజా పరిణామాలపై కేసీఆర్‌తో కేటీఆర్‌ చర్చించారు. ప్రజల క్షేమం కోసం రాత్రింబవళ్లు పనిచేయాల్సిన అవసరముందని కేసీఆర్‌ కేటీఆర్‌కు సూచించారని సమాచారం. కాగా, తెలంగాణభవన్‌లో కార్యకర్తల మధ్య కేటీఆర్‌ భారీ కేక్‌ను కట్‌చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా ేసవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని.. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కల్పించాలని ఆకాంక్షించారు.


అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 05:06 AM