Share News

Flood Inflows: కృష్ణా తరంగిణి తొణికిసలు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 03:49 AM

నాగార్జునుని బోధనలు ఫలించిన చోట.. బౌద్ధమత వృక్షంబు పల్లవించిన చోట కృష్ణవేణి తరంగిణి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తొలకరి మొదలు బిరబిరా పరుగులతో తన పరిధిలోని ప్రాజెక్టులకు జలసిరితో ఓలలాడించిన కృష్ణమ్మ తాజాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టునూ నింపేసింది.

Flood Inflows: కృష్ణా తరంగిణి తొణికిసలు!

  • నదీమతల్లి పరిధిలోని ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండు కుండలా..

  • నేడు తెరచుకోనున్న సాగర్‌ గేట్లు

  • శ్రీశైలం ప్రాజెక్టుకు 2.10 లక్షలు, సాగర్‌కు 1.47 లక్షల క్యూసెక్కుల వరద

హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): నాగార్జునుని బోధనలు ఫలించిన చోట.. బౌద్ధమత వృక్షంబు పల్లవించిన చోట కృష్ణవేణి తరంగిణి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. తొలకరి మొదలు బిరబిరా పరుగులతో తన పరిధిలోని ప్రాజెక్టులకు జలసిరితో ఓలలాడించిన కృష్ణమ్మ తాజాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టునూ నింపేసింది. ఇప్పుడు నాగార్జునకొండ నుంచి దిగువకు దుమికేందుకు సిద్ధమైంది. కృష్ణానది పరిధిలోని ఆల్మట్టి నుంచి సాగర్‌ దాకా రిజర్వాయర్లన్నీ నిండు కుండలా మారాయి. భారీగా ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్‌ గేట్లు మంగళవారం తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత రెండంటే రెండు రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు నిండనుంది. సాగర్‌ నుంచి ఆరుగేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక పూజల అనంతరం మీటనొక్కి నీటిని దిగువకు వదులుతారు. కాగా, సోమవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.


జలవిద్యుదుత్పత్తికి, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మొత్తంగా 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని ఐదు గేట్లు తెరిచి బయటకు తరలిస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా... జలాశయాంలో ప్రస్తుతం 296.57 టీఎంసీల నీరుంది. ఇక పులిచింతల ప్రాజెక్టుకు 31 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. సుంకేసుల బ్యారేజీకి 99 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 49 వేల క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 43 వేలు, జూరాలకు 87 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇక, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు, సింగూరుకు 1860, నిజాసాంగర్‌కు 1617, మిడ్‌ మానేరుకు 1130, లోయర్‌ మానేరుకు 874, కడెం ప్రాజెక్టుకు 2470, శ్రీపాద ఎల్లంపల్లికి 874 క్యూసెక్కుల వరద వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 5.39 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 03:49 AM