Share News

Floods: గోదావరి, కృష్ణలోని ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:33 AM

మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద శనివారం నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టింది.

Floods: గోదావరి, కృష్ణలోని ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద

  • శ్రీశైలం నుంచి ఒక గేటు ద్వారా నీటి విడుదల

  • 548.60 అడుగులకు చేరుకున్న సాగర్‌ నీటి మట్టం

  • భద్రాచలం వద్ద 41.20 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం

మహబూబ్‌నగర్‌/నాగార్జునసాగర్‌/మహదేవపూర్‌/ములుగు/పోలవరం/ధవళేశ్వరం, జూలై 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద శనివారం నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి శుక్రవారం వరకు మూడు గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల వరద తగ్గడంతో అధికారులు శనివారం ఒక గేటుకు కుదించారు. ప్రస్తుతం ఒక గేటు ద్వారా 27,715 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐతో కలుపుకుని మొత్తం 1.17 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ పరివాహకంలో ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు పడిపోతుండటంతో అధికారులు క్రమంగా నీటి విడుదలను కూడా తగ్గించారు. దీంతో రానున్న రెండు రోజుల్లో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా ఇన్‌ఫ్లోలు తగ్గనున్నాయి. మరోవైపు భద్రచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రం నాటికి భద్రాచలం వద్ద 41.20 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువవుతోంది.


పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వే లేరుపాడు మండలాల్లో సుమారు 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగులోకి వరదనీరు చేరడంతో ఎగువన ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చుట్టూ వరదనీరు చేరడంతో ఆ గ్రామంలోని 250కి పైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద 3.5 లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలవగా శనివారం సాయంత్రానికి 5,29,209 క్యూసెక్కులు కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ద్వారా సముద్రంలోకి వెళుతోంది. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అంచనా ప్రకారం గోదావరి వరద ఆదివారం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు.

Updated Date - Jul 13 , 2025 | 05:33 AM