Share News

Kishan Reddy: గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:56 AM

గోదావరి మిగులు జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఏమిటో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు.

Kishan Reddy: గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

మీ తర్వాత సీఎం అయిన చంద్రబాబు బనకచర్లను ప్రతిపాదించారు.. రెండేళ్లుగా మీరేం చేస్తున్నారు

  • ఎప్పుడూ కేంద్రాన్ని విమర్శించడమేనా

  • రేవంత్‌ రెడ్డికి కిషన్‌రెడ్డి ప్రశ్న

  • తాను కోరిన తర్వాతే కేంద్రం ఇద్దరు సీఎంల భేటీ ఏర్పాటు చేసిందని వెల్లడి

హైదరాబాద్‌, జులై 18 (ఆంధ్రజ్యోతి): గోదావరి మిగులు జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ఏమిటో చెప్పాలని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేశారు. ‘‘మీ కంటే ఆరు నెలల తర్వాత చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించారు. గడచిన రెండేళ్లలో మీరేం చేశారు’’ అని నిలదీశారు. ‘‘ఎంతసేపూ కిషన్‌రెడ్డి ఏం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏమిచ్చారు.. అంటూ పడికట్టు పదాలతో అబద్ధాలు వల్లె వేయడం తప్పితే రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క నిర్మాణాత్మక చర్య కూడా చేపట్టలేదు’’ అని ఆయన దుయ్యబట్టారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బనకచర్లపై నేను ప్రధాని మోదీని కలుసుకున్నా. మూడుసార్లు జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యా. బనకచర్ల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరాను. ఆ తర్వాతే, ఇద్దరు సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకుంటామంటే బీఆర్‌ఎ్‌సకు ఎందుకు అభ్యంతరం’’ అని ఆయన మండిపడ్డారు. ఈ ప్రక్రియలో కేంద్రం ఒక సంధానకర్తగా మాత్రమే వ్యవహరించింది తప్ప తీర్పు ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేయలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క రాష్ట్రానికో అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరించబోదని ఆయన చెప్పారు. జలవివాదాలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం సంతోషకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా బీజేపీ విధానాలు మార్చుకోదని బీఆర్‌ఎ్‌సను ఉద్దేశించి అన్నారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భేషజాలు లేవు. బేసిన్‌ల గొడవలు లేవు’’ అంటూ గతంలో అప్పటి ఏపీ సీఎం జగన్‌తో కలిసి ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశం సందర్భంగా కేసీఆర్‌ చేసిన ప్రకటనను కిషన్‌ రెడ్డి చదివి వినిపించారు.


పార్లమెంటులో చట్టం చేస్తేనే వేరే రాష్ట్రంలో గ్రామాల విలీనం

వచ్చే ఏడాది కాజీపేటలో రైలు ఇంజన్ల ఉత్పత్తిని ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ శనివారం వరంగల్‌లో పర్యటిస్తారని, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ పనులను సమీక్షిస్తారని, తర్వాత కాచిగూడ నుంచి రాజస్థాన్‌(జోధ్‌పూర్‌)కు రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారని వెల్లడించారు. కాగా, తెలంగాణ సరిహద్దులోని 12 గ్రామాలు తమవే అంటూ మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్‌ చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లాడిలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ, ఏపీ సీఎంలు ఒప్పుకొంటే వివాదాస్పద ఐదు గ్రామాలపై కూడా పార్లమెంటులో చట్టం తెస్తామని చెప్పారు. పార్లమెంటులో చట్టం అయిన తర్వాతే ఈ గ్రామాలను ఏపీలో విలీనం చేశారని ఆయన గుర్తుచేశారు. కాగా, రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా పంపిణీ చేయడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:56 AM