Kishan Reddy: సీఎం రేవంత్‌కు కనీస అవగాహన లేదు
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:26 AM
‘ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకువస్తారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారా..? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో, న్యాయవాదినో అడిగే చెబుతారు.

ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోదీ
విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా?
ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు
ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వండి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోదీ ఏమైనా విమానంలో తీసుకువస్తారని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారా..? విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో, న్యాయవాదినో అడిగే చెబుతారు. ఎప్పుడో మూడు దశాబ్దాల కిందట జరిగిన ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు అమెరికాలో తలదాచుకుంటే, అతడిని రప్పించడం కోసం ఎంతో పోరాటం చేస్తే, అక్కడి న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏమీ తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసం..? రేవంత్‌కు పాలనా అనుభవం లేకపోవడం, ఆయన దుందుడుకు విధానాలతో తెలంగాణ నష్టపోతోంది. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్రం నవ్వులపాలయ్యే పరిస్థితి ఏర్పడింది’’ అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇస్తే, దానిని తేల్చే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అసమర్థత, చేతగానితనాన్ని బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మెట్రో ప్రాజెక్టు రెండో దశను తానెక్కడ అడ్డుకున్నానో రేవంత్ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘ఆ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమైందా..? నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పారా..?’ అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసిన రేవంత్.. సీఎం అయ్యాక మాట మార్చారని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటా కోసం సమష్టిగా, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
15 రోజుల్లో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు..?
రాష్ట్ర బీజేపీకి 15 రోజుల్లో కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి ఒకేసారి అధ్యక్షుల ఎన్నిక ప్రకటన వెలువడవచ్చని చెప్పారు. రాష్ట్రంలో రబీకి 9.8లక్షల టన్నుల యూరియా అవసరమని కేంద్ర, రాష్ట్ర అధికారుల సంయుక్త సమావేశంలో అంచనా వేయగా.. 10 లక్షల టన్నుల మేర కేంద్రం విడుదల చేసిందని వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల యూరియా కోసం మళ్లీ రైతులు చెప్పులను క్యూలో ఉంచాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తాను ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఎరువుల కొరతపై రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. కేంద్ర మంత్రి జేపీనడ్డాతో మాట్లాడి అదనంగా 48వేల టన్నుల ఎరువులను రాష్ట్రానికి ఇప్పించానని చెప్పారు. ఎరువుల కొరత లేదంటూ కొంత మంది ఉన్నతాధికారులు తనకు చెప్పడం విస్మయం కలిగించిందన్నారు.
ఉద్యోగుల సమస్యలపై మాట్లాడరా..?: ఈటల
హుజూరాబాద్/మద్నూర్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి సభ పెడితే.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తారేమోనని ఆశించామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 317 జీవో సవరిస్తామనో, 5డీఏలు విడుదల చేస్తామనో, హెల్త్ కార్డులు ఇస్తామనో, సీపీఎస్ రద్దు గురించో చెప్తాడనోని భావించామని.. ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన బెనిఫిట్స్ కోసం 8శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.