MLC Kavitha: రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:55 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఖమ్మం, జులై 02: 40 శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకర్లతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు జులై 17వ తేదీన రైలు రోకో కార్యక్రమానికి పిలుపు నిచ్చామని తెలిపారు. ఈ రైలు రోకోలో అత్యధిక సంఖ్యలో పాల్గొని.. బీసీ రిజర్వేషన్లు ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా ఆమె పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొనాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచందర్‌రావుదే బాధ్యత అని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా అని గుర్తు చేశారు. అయితే వైరా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించండి.. అంతేకానీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసుల గురించి కాదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు కవిత చురకలంటించారు. పోలవరం - బనకచర్ల నీటి విషయంలో ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు మాట్లాడాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని అనేక సభలలో ఆ పార్టీ నేతలు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణం బీఆర్ఎస్ పార్టీతోపాటు ఖమ్మం జిల్లాకు తీరని లోటన్నారు. మదన్ లాల్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. మదన్‌లాల్ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కవిత భరోసా ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకోకు బీఆర్ఎస్ పార్టీ పిలుపు నిచ్చింది. అందులోభాగంగా ఇటీవల అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..
పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
Read Latest Telangana News And Telugu News