Share News

KCR: మనసు కాలుతోంది

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:45 AM

తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు.

KCR: మనసు కాలుతోంది

కాంగ్రెస్‌ పాలన చూస్తుంటే బాధేస్తోంది.. మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు

  • నంబర్‌-1 నుంచి 14వ స్థానానికి దిగజార్చారు.. అంతటా కరెంటు కోతలు.. సాగునీరు లేదు

  • తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతోంది

  • అప్పుడూ.. ఇప్పుడూ తెలంగాణకు నం.1 విలన్‌ కాంగ్రెస్సే

  • భూముల అమ్మకం తప్పుకాదు.. అవసరమైతేనే అమ్మాలి

  • 11 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ 11రూపాయలైనా ఇచ్చిందా?

  • కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ను వెంటనే ఆపాలి

  • సర్కార్‌ను మేమెందుకు పడగొడ్తం.. ప్రజలే చూసుకుంటరు

  • రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం

  • ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌

‘‘కాంగ్రెస్సోళ్లు మా అంత సిపాయిలు లేరని చెబితే జనం నమ్మిండ్రు. బోల్తా పడ్డరు. గల్లంతైండ్రు. ఆరు చందమామలు పెడతం. ఏడు సూర్యుళ్లు పెడ్తం అని నమ్మబలికి, ప్రజలను దగాచేసి, మంచిగున్న తెలంగాణను ఆగం చేసిండ్రు. ఓట్లు వేసుకొని ఇలా చేస్తారా?’’

- కేసీఆర్‌

వరంగల్‌/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు. తమ హయాంలో తెలంగాణలో భూముల ధరలు పెంచితే ఇప్పుడు దారుణంగా పడిపోయాయన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతోందని మండిపడ్డారు. ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని తాము పెంచితే.. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని, అవివేకంతో నాశనం చేశారని ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే.. ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్‌ పక్కకు పోగానే ఇంత ఆగమైతదా?’ అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ 11 ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మావోయిస్టులను ఏరివేసేందుకంటూ చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యానికి అవకాశమిస్తూ నక్సలైట్లతో చర్చలు జరపాలని అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు ఎప్పుడూ నంబర్‌వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని, మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దెబ్బతీసిందని అన్నారు.

1 copy.jpg


శ్రీరామచంద్రుని స్ఫూర్తితో..

‘‘కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం ఏదీ లేదన్న శ్రీరామచంద్రుని స్ఫూర్తితో.. దిక్కుతోచని స్థితిలో, ఆత్మహత్యలకు ఆలవాలమై, వలసలకు నిలయమై, వలసవాదుల విషకౌగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని నేను ఒక్కడిగా బయలుదేరిన. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన. 25 ఏళ్ల క్రితం ఈ గులాబీ జెండా ఎగిరింది. ఈ జెండాను ఎందరో అవమానపరిచారు. అవహేళన చేశారు. అనేక త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో ఎగిరిన జెండా... ఉద్యమ తరంగమై ఎగిసిపడింది. ఒకదశలో బరిగీసి.. బిడ్డా నా తెలంగాణను అక్కడ పెట్టు అని నిలబడినం. తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రజలు దీవిస్తే పదేళ్ల పాటు ధగధగలాడే తెలంగాణను తయారుచేసినం. 25 ఏండ్ల సుదీర్ఘ చరిత్రతో ఈ వరంగల్‌ గడ్డమీద రజతోత్సవ సభను జరుపుకొంటున్నాం’’ అని కేసీఆర్‌ అన్నారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ.. వేదనకు, దుఃఖం, హింస, అణవేతకు గురైందని, ఆనాడు కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న ఇక్కడి నేతలు.. పదవుల కోసం పెదవులు మూసుకున్నారే తప్ప.. ఏనాడూ నోరు తెరిచి మాట్లాడలేదని, గులాబీ జెండా ఎగిరేదాకా సోయిని ప్రదర్శించలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో.. తెలంగాణ పదాన్ని నిషేదించారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలన్‌ నెంబర్‌వన్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని కేసీఆర్‌ అన్నారు. ‘‘తెలంగాణ హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్‌ పార్టీ.. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం. 1969లో ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లా కాల్చి చంపింది ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం. మళ్లీ 2001 నుంచి మనం విజృంభిస్తే మళ్లీ ఇదే కాంగ్రెస్‌ పార్టీ 14 ఏళ్లు ఏడిపించింది. నా నిరాహార దీక్ష, ప్రజల భయంకరమైన పోరాటం కారణంగా రాజకీయ అవసరాల కోసం ఇష్టం లేకపోయినా తెలంగాణ ఇచ్చింది’’ అని కేసీఆర్‌ వివరించారు.


అధికారాన్ని బాధ్యతగా తీసుకున్నాం..

ప్రజలిచ్చిన అధికారాన్ని పదవులు అనుభవించడానికి కాకుండా.. బాధ్యతగా తీసుకున్నామని కేసీఆర్‌ అన్నారు. ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకెళ్లామో ప్రజలకు తెలుసునని, అనేక రంగాల్లో అవార్డులు వచ్చాయని, అద్భుతాలు సృష్టించామని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రె్‌సను మించినోడు లేడని, ఇక్కడున్నోళ్లు చాలరన్నట్లుగా డూప్లికేట్‌ గాంధీలు ఢిల్లీ నుంచి దిగివచ్చి చప్పట్లు కొట్టి డ్యాన్యులు చేశారని విమర్శించారు. రైతుబంధు, పింఛన్లు పెంచుతామని మోసం చేశారని, ఆడపిల్లలు స్కూటీలు, విద్యార్థులకు రూ.5 లక్షల బ్యాంకు గ్యారెంటీ కార్డులు, కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం, పంటలకు రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీ.. ఇలా 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం పెడితే.. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునేందుకే ఉపయోగపడుతోందన్నారు. కాంగ్రెస్‌ నేతలు తమపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. ‘‘మా అంత సిపాయిలు లేరని చెబితే.. జనం నమ్మిండ్లు, బోల్తా పడ్డరు. గల్లంతైండ్లు. ప్రజలను దగాచేసి, మంచిగున్న తెలంగాణను ఆగం చేసిండ్లు’’ అని ధ్వజమెత్తారు. పేదలన్నాక ఎక్కడో ఒకచోట గుడిసెలు వేసుకుంటారని, చిన్నగా ఇళ్లు కట్టుకుంటారని కేసీఆర్‌ అన్నారు. అలాంటి వారిని గుర్తించి తాము లక్షలాది ఇంటి పట్టాలు ఇస్తే ఇపుడు హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌ స్థాయికి తాము తీసుకెళితే.. ఇప్పుడు 14వ స్థానానికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాలనే తాను ఇన్నాళ్లూ మాట్లాడలేదని, ఇక అడగాల్సిన సమయం వచ్చిందని అన్నారు. భూముల అమ్మకం తప్పు కాదని, ప్రజలకు మేలు చేసేందుకు అమ్మవచ్చునని, కానీ.. ఏది అమ్మాలో, ఏది అమ్మకూడదు అనే విచక్షణ ఉండాలని కేసీఆర్‌ హితవు పలికారు. యూనివర్సిటీ భూములను ఎలా అమ్మేస్తారని మండిపడ్డారు. మంచి పథకాలను ఏ నాయకుడు పెట్టినా కొనసాగించాలని, కేసీఆర్‌ కిట్‌ను ఎందుకు బంద్‌ చేశారని ప్రశ్నించారు.


పోలీసులూ.. మీ డైరీలో రాసుకొండి..

పోలీసులకు రాజకీయాలెందుకని కేసీఆర్‌ ప్రశ్నించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, ఈ విషయాన్ని పోలీసు మిత్రులు తమ డైరీల్లో రాసుకోవాలని అన్నారు. బీఆర్‌ఎ్‌స సోషల్‌ మీడియా సైన్యంపై అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 20-30 శాతం కమీషన్లు తీసుకుంటోందని కేసీఆర్‌ ఆరోపించారు. స్వయంగా ఆర్థికమంత్రి వద్దకు వెళ్లిన కాంట్రాక్టర్లే ఈ విషయం చెబుతున్నారని అన్నారు. ‘‘కేసీఆర్‌.. అసెంబ్లీకి రా.. అంటున్నరు. పిల్లలు అడిగితేనే జవాబు చెప్పడంలేదు. 20 శాతం కమీషన్‌ తీసుకుంటున్నరని కేటీఆర్‌ అనగానే.. ఆర్థిక మంత్రి భుజాలు తడుముకున్నారు. అసెంబ్లీలో పెద్ద గోల పెడుతున్నారు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.


ఆపరేషన్‌ కగార్‌ ఆపాలి..

కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు 11 రూపాయలైనా ఇచ్చిందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? అని నిలదీశారు. పైగా తెలంగాణను ఉద్దేశించి ప్రధాని మోదీ ఎన్నోసార్లు తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఛత్తీ్‌సగఢ్‌లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తోందని, ఇది ధర్మం కాదని అన్నారు. బలముందని చంపుకొంటూ వెళ్లడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రతిపాదన పెడుతున్నారని, ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేసి.. ప్రజాస్వామ్యానికి అవకాశమిస్తూ మావోయిస్టులతో చర్చలు జరపాలని సూచించారు. ఈ మేరకు సభలో తీర్మానం పెడుతున్నానని, చప్పట్లతో ఆమోదం తెలపాలని సభికులను కోరారు. ‘‘మీ ఆమోదాన్నే తీర్మానంగా భావించి కేంద్రానికి లేఖ పంపుతాం’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే.. ఇంత పెద్దసంఖ్యలో సభకు కదలి వచ్చారంటే.. మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. అందరూ ధైర్యంగా ఉండండి. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. చిరునవ్వులు చిందించే తెలంగాణను తయారుచేసుకుందాం’’ అని అన్నారు.


ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడతాం?

‘‘మీ ప్రభుత్వాన్ని మేమెందుకు పడగొడతాం? అలాంటి కిరికిరి పనులు మేం చేయబోం. ప్రజలు మీకు ఓట్లేశారు. ఆశించిన విధంగా పనిచేయకపోతే.. వారే వీపులు సాపు చేస్తారు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో వేదిక ముందున్న కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడంతో ఆయన చిరాకుపడ్డారు. ప్రసంగాన్ని ఆటంకపరుస్తున్నారంటూ వీళ్లు మన కార్యకర్తలేనా? అని కోపగించుకున్నారు. సాయంత్రం 6.58 గంటలకు ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్‌ 7.58 గంటలకు ముగించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వాగతోపన్యాసం చేయగా.. కేసీఆర్‌ ఒక్కరే రజతోత్సవ సభలో ప్రసంగించారు. ప్రసంగం మొత్తంలో కాంగ్రెస్‌పై విమర్శలు తప్ప.. సీఎం రేవంత్‌రెడ్డి పేరునుగానీ, ఇతర నేతల పేర్లను గానీ ప్రస్తావించలేదు. కేసీఆర్‌ ప్రసంగానికి ముందు.. కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:48 AM