Kazipet Railway Factory: కాజీపేటలో మెట్రో బోగీలు
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:06 AM
తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రైల్వే మంత్రి..

వచ్చే మార్చి నాటికి రూ.521 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభం
బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఇంజన్లు, బోగీలు, వ్యాగన్లు తయారు చేస్తాం
పరిశీలనలో వందే భారత్ కోచ్‌ల తయారీ
చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది మోదీయే
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉద్యోగాలు: కిషన్‌రెడ్డి
వరంగల్/కంది/హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రజల చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైష్ణవ్ మాట్లాడుతూ, రూ.521 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీలో 2026 మార్చి నాటికి ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. కాజీపేట యూనిట్‌ను కేవలం రైల్వే కోచ్‌ల తయారీకి మాత్రమే పరిమితం చేయబోవడం లేదని ప్రకటించారు. ఇక్కడ మెట్రో రైళ్ల బోగీలను కూడా తయారు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఇంజన్లు, వ్యాగన్లు కూడా తయారు చేస్తారన్నారు. వాటికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన కూడా ఇక్కడే జరుగుతుందని వెల్లడించారు. వందే భారత్ రైళ్లను కూడా ఇక్కడే తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించారు.
3 వేల మందికి ఉద్యోగాలు: కిషన్‌రెడ్డి
పీవీ నర్సింహారావు హయాం నుంచి వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ కాజీపేటలో బహుళ రైలు ఉత్పత్తి కేంద్రానికి భూమి పూజ చేశారని చెప్పారు. ఈ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరిన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. వరంగల్ విమానాశ్రయానికి భూమి కేటాయించమని రాష్ట్రంలోని గత ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ జరిపి తమ చేతిలో పెడితే విమానాశ్రయం నిర్మాణం మొదలు పెడతామని ప్రకటించారు. మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నిస్తున్న వారంతా కళ్లు తెరచి కాజీపేట ఫ్యాక్టరీని చూడాలని సూచించారు. రైల్వే సంబంధ అభివృద్ధి కార్యక్రమాలతో మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ ముఖచిత్రాన్ని మారుస్తున్నారని కిషన్‌రెడ్డి కొనియాడారు.
రైజింగ్ స్టార్ ఐఐటీ హైదరాబాద్
కాజీపేట సందర్శనకు ముందు మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ ఐఐటీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. వివిధ విభాగాల్లో చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను, బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ, ఐఐటీ హైదరాబాద్ 2008లో ప్రారంభించినా, అతి తక్కువ కాలంలో దేశ సాంకేతిక విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని కొనియాడారు. అందుకే, ఈ సంస్థ దేశంలోని విద్యాసంస్థల్లోనే రైజింగ్ స్టార్ అన్నారు. జపాన్ సహకారంతో ఐఐటీహెచ్ ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. 5జీ, 6జీ టెక్నాలజీతో పాటు పలు రంగాల పరిశోధనల్లో ఐఐటీ-హెచ్ కీలకపాత్ర పోషిస్తోందని తెలిపారు. అనంతరం మంత్రి సమీపంలోని శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ నుంచి రైల్లో కాజీపేటకు ప్రయాణం అయ్యారు.
జోధ్‌పూర్ రైలు ప్రారంభం
జోధ్‌పూర్, కాచిగూడ స్టేషన్, సికింద్రాబాద్ స్టేషన్ల విస్తరణ, మూడో లైన్ ఏర్పాటుతో కాచిగూడా-భగత్‌కీ కోఠీ స్టేషన్‌ల మధ్య నేరుగా ప్రతీ రోజూ నడిచే రైలు వేసేందుకు వీలు కలిగిందని అశ్వనీ వైష్ణవ్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన కిషన్‌రెడ్డితో కలిసి జోధ్‌పూర్‌కు కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించారు. ప్రవాసీ రాజస్థాన్ వాసుల కోరిక అయిన ఈ రైలు కోసం మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. కిషన్‌రెడ్డికి అందించే ప్రతీ విజ్ఞప్తి తనకు చేరుతుందని, తనకు ప్రత్యేకంగా విజ్ఞప్తులు పెట్టనక్కరలేదని వ్యాఖ్యానించారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పూర్తవుతోందని, వచ్చే ఏడాది ప్రారంభిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్ స్టేషన్‌ను 350 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News