MLC Kavitha: ‘బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్’ ఇది సీఎం రేవంత్ తీరు
ABN , Publish Date - Jul 13 , 2025 | 05:22 AM
అభివృద్ధి గురించి మాట్లాడితే బస్తీమే సవాల్ అంటాడు.. తెల్లారితే పరార్ అవుతాడు.. ఇదీ ముఖ్యమంత్రి తీరు’.. అంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీ కవిత విమర్శ.. పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం
షాద్‌నగర్/ కేశంపేట/హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధి గురించి మాట్లాడితే బస్తీమే సవాల్ అంటాడు.. తెల్లారితే పరార్ అవుతాడు.. ఇదీ ముఖ్యమంత్రి తీరు’.. అంటూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రంగారెడ్డి జిల్లా కాకునూరు గ్రామం నుంచి పోస్టుకార్డుల ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నిలబెట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అధినేత్రి సోనియాగాంధీకి పోస్టుకార్డు పంపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రె్‌సకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క కాకునూరు గ్రామ మహిళలకే ఈ 18 నెలల్లో రూ. 5 కోట్లు బాకీ పడ్డారని, ఆడబిడ్డలకు స్కూటీలు ఇప్పించేందుకు అందరూ ఉద్యమించాలని కవిత అన్నారు.