Kaleshwaram Project: గూగుల్ మ్యాపులు చూసి.. ప్రాజెక్టు లొకేషన్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:05 AM
కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడ కట్టాలో గూగుల్ మ్యాపుల్లో చూసి నిర్ధారించారా? భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు అలైన్‌మెంట్, సామర్థ్యం, నిర్మాణ రకాలకు కూడా గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడ్డారా? కాళేశ్వరాన్ని గత పాలకులు సాంకేతిక ప్రాజెక్టుగా కాకుండా..
అలైన్‌మెంట్, నిర్మాణ రకాలు కూడా గూగుల్ మ్యాప్ ద్వారానే
మాజీ సీఎస్ జోషి అఫిడవిట్
రాజకీయ ఒత్తిడితో వేగంగా ప్రాజెక్టు పూర్తి.. నాణ్యత గాలికి
ఫలితంగా కుంగిన బ్లాకులు
కేసీఆర్ ద్వారా డిజైన్ల మార్పులు స్పష్టం చేసిన కమిషన్ నివేదిక
డీపీఆర్ తయారీలోనూ కేసీఆర్ జోక్యం
స్పష్టం చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టును ఎక్కడ కట్టాలో గూగుల్ మ్యాపుల్లో చూసి నిర్ధారించారా? భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టు అలైన్‌మెంట్, సామర్థ్యం, నిర్మాణ రకాలకు కూడా గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడ్డారా? కాళేశ్వరాన్ని గత పాలకులు సాంకేతిక ప్రాజెక్టుగా కాకుండా.. రాజకీయ ప్రాజెక్టుగానే చూశారా? ఈ ప్రశ్నలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అవుననే చెబుతోంది. నాటి సీఎస్ ఎస్‌కే జోషి తమకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో వేగంపై రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక అజాగ్రత్తలు, భద్రత, ఫీజిబిలిటీని విస్మరించడం, ఇంజనీరింగ్ లోపాలు వెరసి.. ఘోర వైఫల్యానికి దారి తీసినట్లు స్పష్టంచేసింది. ఆ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
జోషి అఫిడవిట్‌లో గూగుల్ మ్యాప్‌ల అంశం
నాటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఎస్‌కే జోషి ఇచ్చిన అఫిడవిట్‌లో.. అప్పటి ముఖ్యమంత్రి(కేసీఆర్) ఆధ్వర్యంలో జరిగిన అనేక సమావేశాల్లో నిపుణులతో కలిసి గూగుల్ మ్యాప్‌ను విస్తృతంగా వినియోగించినట్లు ప్రస్తావించారు. గూగుల్ మ్యాప్‌ల ద్వారానే ప్రాజెక్టు అలైన్‌మెంట్, లొకేషన్, సామర్థ్యం, నిర్మాణ రకాలను పరిశీలించి, ప్రణాళికలను సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఆ సమావేశాల్లో వాప్కోస్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు. నిజానికి 2015 జనవరి 15న ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది. దాని బదులు ప్రాణహిత నదిపై.. వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సిఫార్సు చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణంతో ఆర్థిక నష్టాలు తప్పవని తెలిసీ.. సీఎం కేసీఆర్ అక్కడే నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి నాటి సీఎస్ ఎస్‌కే జోషి, ఉన్నతాధికారులు సి.మురళీధర్, బి.హరిరామ్ బాధ్యులు. వాప్కోస్ డీపీఆర్ అంచనా వ్యయం(రూ.13,594 కోట్లు) చెప్పక ముందే.. సీఎం కేసీఆర్ రూ.71,436 కోట్లు అవుతుందని ప్రకటించారు. నిపుణుల కమిటీ నివేదికకు 46 రోజుల ముందే కేసీఆర్ భారీ అంచనాలతో ఈ ప్రకటన చేయడానికి ఆధారం, ప్రాతిపదిక ఏమిటో తెలియడం లేదు. ఈ ప్రాజెక్టు విషయంలో పేరు కమిటీదే అయినా.. నిర్ణయం మాత్రం కేసీఆర్‌దే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు సంబంధించి ఇంజనీర్లు ఇచ్చిన అఫిడవిట్లలో డిజైన్ల గురించి భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేశారు. మూడు బ్యారేజీల డిజైన్లు తెలంగాణ నీటిపారుదల శాఖ పరిధిలోని ‘కేంద్ర డిజైన్ విభాగం’ ఇచ్చిన ప్రకారమే ఉన్నాయని చెప్పారు. చీఫ్ ఇంజనీరు ఎన్వీ వెంకటేశ్వరరావు వాగ్మూలంలో, కాంట్రాక్టు సంస్థల అఫిడవిట్లలో మాత్రం ‘సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్’ నుంచి డిజైన్లు, డ్రాయింగ్‌లు ఇవ్వడంలో జాప్యం జరిగినట్లు ఉంది. నిర్మాణ ఏజెన్సీలు ఇచ్చిన లేఖలకు శాఖాపరమైన సమాధానాలు సత్వరమే అందివ్వలేదు. మేనేజ్‌మెంట్ సమావేశానికి సంబంధించిన రికార్డులు లేవు.
తొలి దశలో బయటపడ్డ లోపాలు
టర్న్‌కీ విధానంలో కాకుండా గుంపగుత్తగా పనులను కేటాయించడం వల్ల.. డిజైన్, డ్రాయింగ్, నాణ్యత విషయంలో కాంట్రాక్టర్ సంస్థ బాధ్యత తీసుకోలేదు. డిజైన్లు పూర్తికాకముందే కాంట్రాక్టులు ఇవ్వడం, పరిశోధనల ఫలితాలు రాకముందే పనులు ప్రారంభించడంతో ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు అధికారులే డ్రాయింగ్‌లు, డిజైన్లు ఇచ్చారు. సమయానికి భూములు ఇవ్వలేకపోయామని, డిజైన్లు, డ్రాయింగుల్లో జాప్యం జరిగిందని, దీని వల్ల ఏజెన్సీలు కోరినట్లు అదనపు సమయం(ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైం-ఈవోటీ) ఇచ్చామని ఇంజనీర్లు కూడా తెలిపారు. తప్పు ప్రభుత్వం వైపు ఉన్నందున.. ఈవోటీకి ఎలాంటి పెనాల్టీ విధించలేదని చెప్పారు. లోపాలకు కారణం అధికారులే. 2016లోనే కాంట్రాక్టు ఇచ్చినా.. మొదటి డ్రాయింగ్‌ను పూర్తిస్థాయిలో కాకుండా.. ‘కేవలం నమూనా అధ్యయనం కోసం మాత్రమే’ అనే నోట్‌తో 2017లో అందజేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అత్యంత కీలకమైన డ్రాయింగ్, డిజైన్లు సిద్ధం కావాల్సి ఉన్నా.. 2017, 2018లో విడతల వారీగా డ్రాయింగ్‌లు ఇచ్చారు. కొన్ని డ్రాయింగ్‌లను ‘మోడల్ స్టడీ’ కోసమే ఇచ్చి.. చివర్లో సవరణలతో అందజేశారు. ఎన్‌ఐటీ-వరంగల్, ఐఐటీ-మద్రాస్ వంటి సంస్థల నుంచి అధ్యయనాల నివేదికలు రాక ముందే.. నిర్మాణ పనులను ప్రారంభించారు. ఫలితంగా బ్లాకులు కుంగిపోవడం, పిల్లర్లకు పగుళ్లు రావడం జరిగింది. ప్రతీ పనిలో జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగింది. ఫ్లడ్ బ్యాంకులు, మళ్లింపు చానల్ వంటి కొత్త పనులు చేయడం నిధుల దుర్వినియోగానికి కారణం.
మితిమీరిన రాజకీయ జోక్యం
ఎన్నికలలోపు.. పనులను వేగంగా పూర్తిచేయాలంటూ ప్రభుత్వం మితిమీరిన రాజకీయ జోక్యం చేసుకోవడం ప్రాజెక్టు నాణ్యతను దెబ్బతీసింది. 6-7 ఏళ్లు పట్టే ప్రాజెక్టు నిర్మాణాన్ని 2-3 ఏళ్లల్లోనే పూర్తి చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా డిజైన్లలో మార్పులు చేశారు. డీపీఆర్ తయారీలో, తుది నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా లొకేషన్ ఎంపిక చేశారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల నిర్మాణ సంస్థలు నాణ్యతను గాలికొదిలేశాయి. క్యూరింగ్‌కు సమయం ఇవ్వలేదు. రీ-ఇన్‌ఫోర్స్‌మెంట్ ఉల్లంఘనలు జరిగాయి. పరీక్షల్లేకుండా కాంక్రీట్ పౌర్సు పూర్తిచేశారు. దీని వల్ల భవిష్యత్తులో వరదలొస్తే.. బ్యారేజీ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. పునాది బలహీనంగా ఉండటం చీలికలతోపాటు.. కొన్ని సమయాల్లో పెద్ద నష్టం వాటిల్లవచ్చు. మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు ఏటా పెరుగుతాయి. పాలకులు దీన్ని సాంకేతిక ప్రాజెక్టు కంటే.. రాజకీయ ప్రాజెక్టుగానే చూశారు. రూ.80 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు అంచనా వ్యయం.. రూ.1.20 లక్షల కోట్లకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రజలపై అప్పుల భారం పడింది. ప్రాజెక్టు నిర్వహణకు విద్యుత్తు బిల్లులు భారంగా మారాయి. సాగు నీరందించడమే ప్రధాన లక్ష్యంగా మొదలైన ఈ ప్రాజెక్టులో.. చాలాచోట్ల కాలువలు పూర్తికాలేదు. ఫలితంగా రైతులు లబ్ధిపొందలేకపోయారు. నది సహజ ప్రవాహాన్ని మార్చడం వల్ల వరద ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి. కొన్ని గ్రామాలు తరచూ నీటమునిగే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టు కోసం అటవీ భూములను సేకరించారు. పర్యావరణ అనుమతులున్నప్పటికీ.. ఆచరణలో వాటిని ఉల్లంఘించారు.
ఈటలది బాధ్యతారాహిత్యం.. తప్పుడు సమాచారం

కాళేశ్వరం ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతుల విషయంలో నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన వాగ్మూలం అసత్యం. మూడు బ్యారేజీల నిర్మాణం ఎవరి నిర్ణయం అని ప్రశ్నించగా.. క్యాబినెట్ సబ్-కమిటీ సాంకేతిక నివేదికను పరిశీలించి.. క్యాబినెట్ ఆమోదించిందని చెప్పారు. రికార్డులను పరిశీలిస్తే.. పరిపాలన అనుమతుల ఉత్తర్వులు(జీవోలు 231, 232, 233) 2016 మార్చి 1న వెలువడ్డాయి. అయితే.. 2016 మార్చి 15న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. అదే ఏడాది మార్చి 27, ఏప్రిల్ 5, 9 తేదీల్లో ఈ ఉపసంఘం భేటీ అయ్యింది. ఆ తర్వాత నివేదిక ఇచ్చింది. ఈ వాస్తవాలను పరిశీలిస్తే.. ఈటల తప్పుడు సమాచారం ఇచ్చారని స్పష్టమవుతోంది. నిజానికి మంత్రివర్గ ఉపసంఘం మూడు బ్యారేజీల నిర్మాణానికి సిఫార్సు చేయలేదు. డీపీఆర్ కోసం రూ.594.45 కోట్ల మేర వాప్కో్‌సకు జరిపిన చెల్లింపుల గురించి తెలుసా? అని ప్రశ్నించగా.. ఈటల తెలియదని సమాధానమిచ్చారు. దీన్నిబట్టి ఆర్థిక మంత్రిగా తన బాధ్యతలపై ఆయనకు అవగాహన లేదనేది స్పష్టమవుతోంది. ఈటల వాంగ్మూలం ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.63 వేల కోట్లు. భూసేకరణలో జాప్యం వల్ల ఆ అంచనాలు రూ.80వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లకు పెరిగాయి. ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధులు, అప్పుల బాధ్యతను కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్) తీసుకుంది. కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అసలు రుణభారాన్ని నాటి ప్రభుత్వం దాచిపెట్టింది. బయట నుంచి తీసుకొచ్చే అప్పుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల ఈ మొత్తం వ్యవహారం తనకు తెలియదని చెప్పడం బాధ్యాతారాహిత్యమే.
ఇవి కూడా చదవండి
లిక్కర్ కేసులో మాజీ సీఎం జైలుకు పోవటం ఖాయం.. గోనె ప్రకాష్ రావు సంచలన ప్రెస్‌మీట్
మహా గణపతి దర్శనం కోసం తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు..