Share News

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ.. కళ్లు చెదిరే ఆస్తి

ABN , Publish Date - Apr 27 , 2025 | 04:13 AM

కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) భూక్యా హరిరామ్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్‌ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

Kaleshwaram Project: కాళేశ్వరం ఈఎన్‌సీ.. కళ్లు చెదిరే ఆస్తి

  • హరిరామ్‌ ఇల్లు సహా 14 చోట్ల ఏసీబీ సోదాలు

  • మర్కూక్‌లో 28 ఎకరాల వ్యవసాయ భూమి

  • బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట

  • హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లు, ఇళ్లు, స్థలాలు

  • ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం

  • భూక్యా హరిరామ్‌ అరెస్టు, జ్యుడీషియల్‌ రిమాండ్‌

  • కాళేశ్వరం నిర్మాణంలో ఈఎన్‌సీది కీలక పాత్ర

  • ఆయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు

హైదరాబాద్‌, కొత్తగూడెం, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌) భూక్యా హరిరామ్‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్‌ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరోపక్క, కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్‌ ఇల్లు, జలసౌధ కార్యాలలయం, హరిరామ్‌ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు శనివారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు కళ్లుచెదిరే ఆస్తులను గుర్తించారు. ఏసీబీ ప్రకటన ప్రకారం.. హరిరామ్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న మర్కూక్‌ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. అంతేకాక, హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్‌, శ్రీనగర్‌కాలనీ, నార్సింగ్‌లో ఫ్లాట్లు ఉన్నాయి. పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్‌ కాలనీలో రెండు ఇండిపెండెంట్‌ ఇళ్లు కూడా ఉన్నాయి. బొమ్మలరామారంలో ఆరు ఎకరాలలో ఫామ్‌హౌస్‌, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్‌, మిర్యాలగూడలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక, బీఎండబ్ల్యూ సహా రెండు కార్లు, ఉన్నాయి. ఇవే కాక, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కూడా గుర్తించారు. ఆయా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు హరిరామ్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు తెలిపింది. సోదాలు కొనసాగుతున్నాయని, హరిరామ్‌ ఆస్తుల చిట్టా మరింత పెరిగే అవకాశముందని ఏసీబీ పేర్కొంది. కాగా, హైదరాబాద్‌, షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్‌లో హరిరామ్‌ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేసిన అధికారులు.. అక్కడి కంప్యూటర్లు, లాప్‌టా్‌పలను పరిశీలించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్‌ భార్య అనిత ఇరిగేషన్‌ విభాగంలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామం.. హరిరామ్‌ స్వగ్రామం. ఎదురగడ్డలోని హరిరామ్‌ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇంట్లో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్‌ ఆధ్వర్యంలోని బృందం సోదాలు చేసింది. నిజానికి, ఏసీబీ దాడులు జరుగుతాయనే సమాచారం చాలా రోజుల నుంచే ఉండడంతో హరిరామ్‌ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారని, చాలా ఆస్తులు బినామీల పేర్లతో పెట్టారని సమాచారం.


హరిరామ్‌ 48,665 కోట్ల పనులు

గజ్వేల్‌ ఈఎన్‌సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్‌ ఎండీగా బి.హరిరామ్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్‌ నుంచి నిర్మాణం వరకు కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.1.47 లక్షల కోట్లు కాగా, అందులో రూ.48,665 కోట్ల అంచనా కలిగిన పనులు హరిరామ్‌ పర్యవేక్షణలోనే జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడు లింక్‌లు, 28 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. ఇందులో లింకులు-4, 5, 6 పరిధిలోని ప్యాకేజీలు 10 నుంచి 19 కిందికి వచ్చే పనులను హరిరామ్‌ చేయించారు. మిడ్‌మానేరు రిజర్వాయర్‌ నుంచి రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, మల్లన్నసాగర్‌, సింగూరు జలాశయానికి నీళ్లను ఎత్తిపోసేందుకు సంబంధించిన నిర్మాణ పనులు ఇందులో ఉన్నాయి. లింకులు 4, 5, 6 కింద వచ్చే పనుల అంచనా వ్యయం రూ.41,568.39 కోట్లు కాగా అది రూ.48,665.54 కోట్లకు పెరిగింది. ఈ లింకుల పరిధిలో రాని ఇతర పనులను కూడా హరిరామ్‌ పర్యవేక్షించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద హరిరామ్‌ ఆధ్వర్యంలో జరిగిన పనులు కలుపుకుంటే మొత్తం రూ.50వేల కోట్లకు పైగా విలువైన పనులు జరిగినట్టేనని నీటిపారుదలశాఖ వర్గాలు అంటున్నాయి.


సగంవ్యయం హరిరామ్‌ పర్యవేక్షణలోనే

రూ.82,252.75 కోట్ల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాగా, ప్రస్తుతానికి అది రూ.1.47 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.96,291.57 కోట్లు విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ.40వేల కోట్లకు పైగా వ్యయం హరిరామ్‌ ఆధ్వర్యంలోనే జరిగినట్లు సమాచారం. హరిరామ్‌ గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా పనిచేశారు. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆ ప్రాజెక్టులో 2016 మార్చి నాటికి రూ.11,642.85 కోట్లు విలువైన పనులు జరిగాయి. ఆ తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీ-ఇంజనీరింగ్‌ పేరుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. ప్రాణహిత-చెవెళ్ల కింద తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ నిర్మించాల్సి ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్దకి మార్పు చేశారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌కి కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నుంచి అనుమతుల కోసం ప్రాజెక్టు ప్రొపోనెంట్‌ హోదాలో హరిరామ్‌ దరఖాస్తు చేశారు. ఇక, కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఐపీసీఎల్‌) ఎండీగా ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం రుణ సమీకరణలో కీలకంగా వ్యవహరించారు. కేఐపీసీఎల్‌కి బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.87,449 కోట్ల రుణాలు మంజూరు కాగా, రూ.64,283 కోట్ల రుణాలు విడుదలయ్యాయి.


ఇవి కూడా చదవండి

Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్

Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 27 , 2025 | 04:13 AM