Kaleshwaram: బినామీల గుట్టు విప్పని హరిరామ్!
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:30 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

ఆస్తుల లెక్క రూ.200 కోట్ల పైమాటే.. కాళేశ్వరం ఈఎన్‌సీకి 14 రోజుల రిమాండ్
చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, తన బినామీల గుట్టును హరిరామ్ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయ న్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావిస్తోంది. హరిరామ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3గంటలకు న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించగా హరిరామ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
వేలకోట్ల పనుల్లో భాగస్వామి
కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో హరిరామ్ కీలకపాత్ర పోషించారు. హరిరామ్ చేతుల మీదుగా వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరిగాయి. ఈ క్రమంలోనే హరిరామ్ భారీగా అక్రమఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా విలువ ఉండే ఆస్తులను ఇప్పటిదాకా గుర్తించామని అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న మర్కూక్ మండలంలో హరిరామ్ 28 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్, కొండాపూర్‌లో హరిరామ్‌కు రెండు విల్లాలుండగా వాటి విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఇక, హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, మాదాపూర్, నార్సింగ్ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఫ్లాట్ల విలువ రూ.10 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఏపీ రాజధాని అమరావతిలో హరిరామ్‌కు ఉన్న వాణిజ్య స్థలం విలువ రూ.20 కోట్లు ఉండవచ్చునని చెబుతున్నారు. ఇవే కాక, పటాన్‌చెరు లాంటి కీలక ప్రాంతంలో 20 గుంటల స్ధలం, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల మామిడితోటలో ఖరీదైన ఫామ్‌హౌస్, కొత్తగూడెంలో ఓ వాణిజ్య సముదాయం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఇళ్ల స్థలాలు గుర్తించారు. హరిరామ్‌కు చెందిన కొన్ని బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉంది. కాగా, హరిరామ్‌ను విచారించే విషయంలో వారం రోజులు కస్డడీ కోరుతూ ఏసీబీ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.