Share News

Kaleshwaram Project: 6న హైదరాబాద్‌కు జస్టిస్‌ ఘోష్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:41 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు.

Kaleshwaram Project: 6న హైదరాబాద్‌కు జస్టిస్‌ ఘోష్‌

  • మంత్రివర్గ ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణం

  • కమిషన్‌కు ఆధారాలు సమర్పించిన సర్కారు

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ఈ నెల 6న హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం లేదని నిరూపించే పత్రాలను అధికారులు బుధవారం కమిషన్‌ కార్యాలయంలో అందజేశారు. బ్యారేజీల నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్న ఏడాది తర్వాత.., అది కూడా నిర్మాణం ప్రారంభించి, డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించిన తర్వాత మంత్రివర్గంలో బ్యారేజీల నిర్మాణ నిర్ణయాన్ని ధ్రువీకరించుకున్నట్లు ఆధారాలతో కూడిన పత్రాలను కమిషన్‌కు అందించినట్లు తెలిసింది. కాగా, జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు గత నెల 11న హాజరైన మాజీ సీఎం కేసీఆర్‌.. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని, మొత్తం మంత్రివర్గం కలిసి తీసుకున్నదని చెప్పిన విషయం తెలిసిందే. ఈటల, హరీశ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


మరోవైపు బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవడానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌ సభ్యులుగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం బ్యారేజీల నిర్మాణాలపై సిఫారసు చేసిందని కూడా విచారణలో చెప్పారు. అవన్నీ అవాస్తవాలని తుమ్మల ఖండించారు. ఈ నేపథ్యంలో వారిచ్చిన సాక్ష్యాలు కాకుండా.. ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలను అందించాలని కోరుతూ కమిషన్‌ లేఖ రాసింది. దీంతో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్న కొన్ని నెలల తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయాన్ని ర్యాటిఫికేషన్‌ చేసుకున్నారని.. కేసీఆర్‌, హరీశ్‌, ఈటల చెప్పినవన్నీ అవాస్తవాలంటూ సంబంధిత ఆధారాలను ప్రభుత్వం కమిషన్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పత్రాలను అధ్యయనం చేసి, నివేదిక సమర్పించడానికి కమిషన్‌ మరింత గడువు కోరుతుందా? లేక ఈ నెలాఖరులోగా నివేదికను ఇస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఈ నెలాఖరుతో కమిషన్‌ గడువు ముగియనుంది.

Updated Date - Jul 03 , 2025 | 05:41 AM