Share News

JNTUH: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా.. ఇంజనీరింగ్‌కు కొత్త సిలబస్‌

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:48 AM

ఇంజనీరింగ్‌ విద్యలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జేఎన్‌టీయూహెచ్‌ కొత్త అకడమిక్‌ (ఆర్‌25) రెగ్యులేషన్స్‌ను రూపొందించింది.

JNTUH: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా.. ఇంజనీరింగ్‌కు కొత్త సిలబస్‌

  • జేఎన్‌టీయూ వీసీ కిషన్‌ కుమార్‌ రెడ్డి

  • కొత్త అకడమిక్‌ రెగ్యులేషన్స్‌పై ముగిసిన కసరత్తు

  • మొత్తం 164 క్రెడిట్లు.. అందులో 160 వస్తే చాలు

  • తక్కువ గ్రేడ్‌ లేదా ఫెయిలైన సబ్జెక్టుల నుంచి 4 క్రెడిట్‌ల వరకూ మినహాయింపు

  • పాస్‌ కాకపోతే రెగ్యులర్‌ సబ్జెక్టులు తీసుకోవచ్చు

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా జేఎన్‌టీయూహెచ్‌ కొత్త అకడమిక్‌ (ఆర్‌25) రెగ్యులేషన్స్‌ను రూపొందించింది. వీటిపై వర్సిటీ ప్రాంగణంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాయింట్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్ల సమావేశం శుక్రవారం ముగిసింది. కొత్త అకడమిక్‌ రెగ్యులేషన్స్‌లో కీలక అంశాలను వర్సిటీ వీసీ టి.కిషన్‌కుమార్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని నాన్‌ అటానమస్‌ అఫిలియేటెడ్‌ కళాశాలలకు తాజా (ఆర్‌25) నిబంధనలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయని, అటానమస్‌ హోదా కలిగిన కళాశాలలకు.. ఈ నిబంధనలను మార్గదర్శకంగా తీసుకొని కోర్సు నిర్మాణాలను, సిలబ్‌సను అనుమతించదగిన పరిమితుల్లో మార్చుకునే సౌలభ్యం ఉందన్నారు.


ఆర్‌25 నిబంధనల్లో ప్రధాన అంశాలివీ..

బీటెక్‌ ప్రోగ్రామ్‌కు 164 క్రెడిట్‌లు అవసరం. అయితే, విద్యార్థులు తక్కువ-గ్రేడ్‌ లేదా ఫెయిలైన సబ్జెక్టుల నుంచి 4 క్రెడిట్‌ల వరకు (ల్యాబ్‌లు, సెమినార్‌లు, ప్రాజెక్ట్‌లు లేదా ఇంటర్న్‌షి్‌పలు మినహా) మినహాయింపు పొందవచ్చు. పరిశ్రమ-సంబంధిత నైపుణ్యాల కోసం ప్రత్యేకంగా ల్యాబ్‌ కోర్సులను ప్రవేశపెడుతున్నారు.

  • మల్టిపుల్‌ ఎగ్జిట్‌-మల్టిపుల్‌ ఎంట్రీ (ఎంఈఎంఈ) ఆప్షన్‌లో భాగంగా విద్యార్థులు సెకండియర్‌ సంవత్సరం తర్వాత అన్ని కోర్సులూ ఉత్తీర్ణులై 2 అదనపు క్రెడిట్లతో బయటకు వెళ్లిపోవచ్చు. అయితే.. ఆరు వారాల వృత్తిపరమైన కోర్సు/ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఎగ్జిట్‌ కోసం రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ ప్రారంభంలోనే ఆప్షన్‌ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత.. గరిష్ఠంగా ఐదేళ్లలోపు తిరిగి మూడో సంవత్సరంలో చేరడానికి అనుమతిస్తారు.

  • విద్యార్థులు ఒక సెమిస్టర్‌ ముందుగానే మూక్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ మూక్‌ కోర్సులు పాస్‌ కాలేని పక్షంలో రెగ్యులర్‌ సబ్జెక్టులను తీసుకోవచ్చు.

  • రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టులతో పాటు బీటెక్‌ విద్యార్థులు మొత్తం 3 క్రెడిట్‌లు కలిగిన నాలుగు తప్పనిసరి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. వాటికి ఈ ఏడాది నుంచి క్రెడిట్స్‌ వర్తింపజేయాలని నిబంధనల్లో పొందుపరిచారు. ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు క్రెడిట్‌లు ఒక్కొక్కటి చొప్పున, జెండర్‌ సెన్సిటైజేషన్‌, భారత రాజ్యాంగం సబ్జెక్టులకు 0.5 క్రెడిట్‌లు చొప్పున ఇస్తారు.

  • అనివార్య పరిస్థితుల కారణంగా విద్యార్థి ఏదైనా మిడ్‌టర్మ్‌ (ఇంటర్నల్‌) పరీక్షకు హాజరుకాని పక్షంలో.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు (సీబీటీ) హాజరుకావచ్చు.

  • వివిధ కారణాల వలన విద్యాసంవత్సరం కోల్పోయి, తిరిగి ప్రవేశం (రీ-అడ్మిషన్‌) పొందిన విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు వీలుగా సమానమైన సబ్జెక్టుల కోసం లుకప్‌ టేబుల్‌ను బోర్డ్‌ ఆఫ్‌ చైర్‌పర్సన్లు రూపొందిస్తారు.

  • ఇప్పటివరకూ కంప్యూటర్‌ సైన్స్‌లోనే మైనర్‌ డిగ్రీలను అందించారు. ఇకపై సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వంటి వాటిలోనూ మైనర్‌ ప్రోగ్రామ్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

  • ఇంటర్న్‌షి్‌పలు, పరీక్షల ప్రణాళిక కోసం ప్రైవేటు కళాశాలలు, జేఎన్‌టీయూ అకడమిక్‌ క్యాలెండరుకు అనుగుణంగా తమ క్యాలెండరును రూపొందించుకోవాలి.

  • స్టార్టప్‌ సంస్కృతి, వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించడానికి రెండోసంవత్సరంలో ఇన్నోవేషన్‌ ఆండ్‌ ఆంత్రప్రెనర్‌షిప్‌ కోర్సును ప్రవేశపెడుతున్నారు.


  • రాష్ట్రంలో యూకే వర్సిటీల ఆఫ్‌ క్యాంప్‌సలు

  • ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

యూకేకు చెందిన విశ్వవిద్యాలయాల ఆఫ్‌-క్యాంప్‌సలను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించిన యూకే తెలుగు రాష్ట్రాల డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఒవెన్‌ బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా యూకే-తెలంగాణ వర్సిటీల మధ్య సహకారం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమం, వర్సిటీలు సంయుక్తంగా అందించే సమీకృత డిగ్రీ కోర్సులు, డ్యుయల్‌ డి గ్రీ కోర్సులపై వారితో చర్చించారు. కార్యక్రమంలో మండలి వైస్‌చైర్మన్‌ ఎస్‌.కె.మహమూద్‌, కార్యదర్శి శ్రీరామ్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 03:48 AM