Telangana politics: రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:51 AM
రేవంత్ నాటు కోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి.. రేవంత్‌ను నువ్వు మొగోడివా అనేంత సీన్ నీకు లేదు కేటీఆర్..

రేవంత్‌ను నువ్వు మొగోడివా అనేంత సీన్ కేటీఆర్‌కు లేదు.. సెక్యూరిటీ వదిలేసి రారా సాలే అని వస్తే తట్టుకోగలవా కేటీఆర్
రేవంత్ సడన్‌గా వస్తే నీకు గుండెపోటు వస్తుందేమో..
వాళ్లను తలకాయ వరకు భూమిలో పాతి తలకాయల పైన పాములను వదలాలి
పదేళ్లు వాళ్లు నీచంగా పాలించారు
కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై సిద్దిపేట,సిరిసిల్ల, గజ్వేల్‌లలో చర్చకు సిద్ధమా..?
కేసీఆర్ కుటుంబాన్ని ఎంత తిట్టినా తప్పులేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ‘‘రేవంత్ నాటు కోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి.. రేవంత్‌ను నువ్వు మొగోడివా అనేంత సీన్ నీకు లేదు కేటీఆర్.. అనవసరంగా రేవంత్‌ను రెచ్చగొట్టకు.. సెక్యూరిటీ వదిలేసి.. రారా సాలె అని వస్తే తట్టుకోగలుగుతావా?.. తట్టుకునే గట్స్ నీకు లేవు.. రేవంత్ సడెన్‌గా వస్తే .. నీకు గుండెపోటు వస్తుందేమో చూసుకో మల్లా..’’ అంటూ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి. జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ఇంటికి పోలీసులను పంపించింది కేటీఆర్ అని, కానీ ఇప్పుడు రేవంత్ కేటీఆర్ ఇంటికి పోలీసులను పంపడం లేదని..అదే కాంగ్రె్‌సకు, బీఆర్‌ఎ్‌సకు ఉన్న తేడా అని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బ్రహ్మాండంగా పాలన సాగిస్తున్నారన్నారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం నీచమైన పాలన చేసినందునే వారిని తిట్టాల్సి వస్తోందన్నారు. నాడు మల్లన్న సాగర్ రైతులను హింసించారని, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను తిట్టడం కాదు.. వాళ్లను తలకాయ వరకు భూమిలో పాతి.. ఆ తలకాయలపైకి పాములు వదిలి.. నరకం చూపించాలని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం నాయకత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, వడ్లకు బోనస్ పథకాలపై మంత్రి ఉత్తమ్, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లలో చర్చకు సిద్ధం.. మీరు సిద్ధమా’’ అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సీఎం అయి 18 నెలలు అయిందని, పదేళ్ల పాలనలో కేసీఆర్ ఇచ్చిన హామీలను పూర్తి చేయలేదు కాబట్టే తిట్టామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌లకు ఎమ్మెల్యే సభ్యత్వం లేకుండా చేశారని, అలాంటి వాళ్లను ఎన్ని తిట్లు తిట్టినా తప్పులేదన్నారు.
రైతులను గజగజ వణికించిన పాలన మీది..
బీఆర్‌ఎస్ పాలనలో మల్లన్న సాగర్ రైతులను కొట్టిన దెబ్బలు మామూలువి కావని జగ్గారెడ్డి అన్నారు. ఒక్కో రైతు మీద ముప్పై లాటీలతో కొడితే వీపులు పగిలాయని చెప్పారు. రైతులను గజగజా వణికించిన నీచమైన పాలన కేసీఆర్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజాపాలన చూసి కేటీఆర్‌కు కడుపు మంటగా ఉందన్నారు. పదేళ్ల పాలనలో మహిళా సంఘాలు ఏమయ్యాయని నిలదీశారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నామని, ఇలాంటి పథకం పెట్టాలనే ఆలోచన కేసీఆర్‌కు వచ్చిందా.. ఇంత మంచి పథకాలు అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్‌ను, మంత్రులను తిడుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు స్ర్కిప్ట్ ఇస్తున్న వారు సరిగా ఇవ్వడం లేదన్నారు. ఆయన విదేశాల్లో చదువుకుని వచ్చి.. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే జాలి పడుతున్నామన్నారు. కేటీఆర్‌కు చీమూ, నెత్తురు లేకుండా పద్ధతిలేని మనిషిలా మారాడని విమర్శించారు. రేవంత్‌ను అన్న మాటలు వింటే నెత్తురు మరుగుతోందని ఆయన అన్నారు.