Jagga Reddy: రాహుల్ గాంధీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:05 AM
రాహుల్ గాంధీపై కేసీఆర్ అనవసరంగా మాట తూలారని, వాస్తవానికి తెలంగాణ ఇచ్చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతనే ప్రక్రియ మొదలైందని చెప్పారు.

ఆయన ఇవ్వాలని చెబితేనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు
సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకే కేసీఆర్ సీఎం అయిండు
అప్పుడు ఒరిజినల్ గాంధీ కుటుంబం.. ఇప్పుడేమో నకిలీ గాంధీ కుటుంబమైందా?
ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ఎప్పుడూ హీరోనే
బీఆర్‌ఎస్ వాళ్లకు మాత్రం విలనే
రేవంత్ అంటే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి పోవట్లేదు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ‘‘పదేళ్లు తెలంగాణకు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. గతాన్ని మరిచి డూప్లికేట్ గాంధీలంటూ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చుండేదే కాదని చెప్పింది ఆయనే కదా? ఆయన మాటపై ఆయనకే విలువ లేదా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీపై కేసీఆర్ అనవసరంగా మాట తూలారని, వాస్తవానికి తెలంగాణ ఇచ్చేయాలంటూ రాహుల్ గాంధీ చెప్పిన తర్వాతనే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ‘‘తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దేవుళ్లన్న కేసీఆర్‌కు కడుపు నిండింది కదా అని ఇవాళ వాళ్లు దయ్యాలయ్యారా’’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీకి కేసీఆర్ ఎలా ప్రచారం చేశారో.. తమ పార్టీకి రాహుల్ గాంధీ కూడా అలాగే ప్రచారం చేశారన్నారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనను పరిపూర్ణత చెందిన నాయకునిగానే తాను భావిస్తానని చెప్పారు. కానీ ఈ వయసులో ఇంతగా దిగజారి మాట్లాడటం ఆయనకు అవసరమా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన కుటుంబం కేవలం రాహుల్ గాంధీ కుటుంబమేనన్నారు. బ్రిటిష్ పాలనలో కూడా దేశం కోసం రూ.లక్షల కోట్లు ధారాదత్తం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని చెప్పారు.
కాంగ్రెస్ నాయకత్వంలేకుంటే కేసీఆర్ దీక్ష జరిగేదే కాదు
తెలంగాణ నినాదం నుంచి వెనక్కు తగ్గాలని కేసీఆర్ అనుకున్న సమయంలో ఆయన్ను లేపిందే కాంగ్రెస్ నేతలని జగ్డారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకత్వమే వెనకాల లేకుంటే కేసీఆర్ దీక్ష జరిగి ఉండేదే కాదని చెప్పారు. రాష్ట్ర విభజన కోసం తమ పార్టీ నేతలు ఆయన వెనక నిలబడి నడిపించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఉనికిని కాపాడుకునే పనిలో భాగంగానే కేసీఆర్ వరంగల్ సభ నిర్వహించారని చెప్పారు. ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హీరోనేనని, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ వాళ్లకు మాత్రమే విలన్ అని విమర్శించారు. సీఎం రేవంత్ భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లట్లేదన్నారు. వెళితే రేవంత్ కడిగేస్తాడన్న భయంతో ఉన్న కేసీఆర్.. దాన్నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే.. వారిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుందో చూద్దామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఢిల్లీకి, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు సహా ఆరేడు రాష్ట్రాలకు డబ్బు సంచులు మోసిందే కేసీఆర్ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్