Share News

Jagga Reddy: మీరు పదేళ్లలో చేస్తే.. రేవంత్‌ ఏడాదిలోనే చేశారు

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:04 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు.

Jagga Reddy: మీరు పదేళ్లలో చేస్తే.. రేవంత్‌ ఏడాదిలోనే చేశారు

బీఆర్‌ఎస్‌ పదేళ్లలో చేసిన రుణమాఫీ 20వేల కోట్లు.. కాంగ్రెస్‌ ఏకకాలంలో చేసింది 22వేల కోట్లు

  • మరి మీరు గొప్పనా.. కాంగ్రెస్‌ గొప్పనా

  • కేసీఆర్‌కు జగ్గారెడ్డి సూటి ప్రశ్న

  • మహిళలకు ఉచిత బస్సు కూడా తప్పేనా?

  • కేసీఆర్‌ ఆ పథకాన్ని విమర్శించారంటే సక్సెస్‌ అయినట్లే

  • కాంగ్రెస్‌ సర్కారు స్వేచ్ఛతోనే బీఆర్‌ఎస్‌ సభ

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి ఏక కాలంలో రూ.22 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తే.. నువ్వు పదేళ్ల పాలనలో చేసిన మాఫీ రూ.20 వేల కోట్లు మాత్రమే. ఏడాది లోపే రూ.22 వేల కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్‌ గొప్పనా.. లేక పదేళ్లు టైం తీసుకుని రూ.20 వేల కోట్లు మాఫీ చేసిన బీఆర్‌ఎస్‌ గొప్పనా’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రుణమాఫీకీ చాలా తేడా ఉందన్నారు. రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డికి ఐదేళ్ల సమయం ఉన్నా, ఆయన సాగదీయలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాది లోపే, ఏక కాలంలో రూ.22 వేల కోట్ల రుణ మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ పదేళ్ల కాలంలో 8 కిస్తీల్లో చేసిన రుణమాఫీ రూ.20వేల కోట్లు మాత్రమేనన్నారు. ఈ తేడాను రాష్ట్రంలోని రైతులంతా గమనించాలని జగ్గారెడ్డి కోరారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. రైతు రుణమాఫీపై చర్చకు కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్‌ విసిరారు.


ఉచిత బస్సుతో బీఆర్‌ఎ్‌సకు నష్టం

ఉచిత బస్సు పథకం అమలు కారణంగా ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారన్న కేసీఆర్‌ వ్యాఖ్యాలపైనా జగ్గారెడ్డి స్పందించారు. ఆ పథకాన్ని అమలు చేయాలంటారా.. వద్దంటారా అన్నది కేసీఆర్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కూడా తప్పేనా అని నిలదీశారు. ‘‘ఆర్టీసీని కేసీఆర్‌ కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తే, దానికి జీవం పోసింది రాహుల్‌ గాంధీ’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రాహుల్‌ గాంధీ మాట ఇస్తే.. దాన్ని అమలు చేసిన ఘనత రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లదన్నారు. ఉచిత బస్సు పథకాన్ని కేసీఆర్‌ విమర్శించారంటే ఆ పథకం సక్సెస్‌ అయినట్లేనని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో కేసీఆర్‌ సభ జరగడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛే కారణమని జగ్గారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు రోడ్లపై డాన్సులు చేసుకుంటూ వెళ్లినా పోలీసులు ఏమీ అనలేదన్నారు. అదే బీఆర్‌ఎస్‌ హయాంలో తమను అడ్డుకున్నారని, అరెస్టు చేశారని గుర్తు చేశారు. వరంగల్‌ సభలో అనేక సమస్యలు ప్రస్తావించిన కేసీఆర్‌..16 నెలలుగా ఇంట్లోనే ఎందుకు ఉండిపోయారని ప్రశ్నించారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోన్‌సతో రైతులు సంతోషంగా ఉన్నారని, సీఎం రేవంత్‌, మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల భేష్‌ అంటూ కితాబునిస్తున్నారని పేర్కొన్నారు. ఐదెకరాల్లో సన్న వడ్లు సాగు చేస్తే రైతులకు బోనస్సే రూ.75 వేల దాకా వస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:04 AM