Share News

Jagga Reddy: సీఎం రేవంత్‌... వెరీ గుడ్‌!

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:55 AM

సీఎం రేవంత్‌రెడ్డి.. వెరీ గుడ్‌! ఇది మేము అంటున్నది కాదు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులంతా అంటున్న మాట’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు.

Jagga Reddy: సీఎం రేవంత్‌... వెరీ గుడ్‌!

ఇదీ.. రాష్ట్రంలోని రైతులు చెబుతున్న మాట

  • రైతుబంధు జమకు కేసీఆర్‌ 5 నెలలు తీసుకున్నడు.. రేవంత్‌.. 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేసిండు

  • కాంగ్రెస్‌ పాలనకు.. కేసీఆర్‌ పాలనకు ఉన్న తేడా ఇదీ.. ఖజానా కొల్లగొట్టి.. కాంగ్రె్‌సపై నిందలా?

  • నా ఫోన్‌ ట్యాప్‌ అవుతోందని పోలీసులు చెప్పారు.. ట్యాప్‌ చేసినా వాళ్లు చేసేది ఏమీ ఉండదని చెప్పా

  • లిక్కర్‌ డాన్‌ కవితకు వందల కోట్లు ఎలా వచ్చాయి?.. కేసీఆర్‌ ఇల్లు.. డ్రామా కంపెనీ అయింది: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి.. వెరీ గుడ్‌! ఇది మేము అంటున్నది కాదు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులంతా అంటున్న మాట’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వెల్లడించారు. నాడు రైతు బంధు నిధులు జమ చేయడానికి కేసీఆర్‌ ఐదు నెలల సమయం తీసుకుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేసేశారన్నారు. కాంగ్రెస్‌ పాలనకు, కేసీఆర్‌ పాలనకు మధ్య ఉన్న తేడా ఇదన్నారు. గాంధీభవన్‌లో గురువారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులందరికీ.. రైతు భరోసా నిధులు ఒకే సారి వేయాలన్న సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి ఆలోచన.. సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ కుటుంబం.. రాష్ట్ర ఖజానాను దివాలా తీయించినా.. బాధ్యత గలిగిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. రాహుల్‌, సోనియా, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీ మేరకు భూమి ఉన్న ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ చేయలేని పని తమ ప్రభుత్వం చేయడంతో హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని, కాంగ్రె్‌సపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేయించి, కేసీఆర్‌ సాధించిందేంటి? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


తన ఫోనూ ట్యాప్‌ అవుతోందని పోలీసులు, తమ పార్టీ కార్యకర్తలూ చెప్పేవారని, అయితే ట్యాప్‌ చేసి వారు సాధించేది ఏమీ లేదని తాను చెప్పేవాడినన్నారు. చివరకు భార్యాభర్తలు మాట్లాడుకున్నదీ రికార్డు చేసి.. బీఆర్‌ఎస్‌ నీచానికి పాల్పడిందన్నారు. అందరి ఫోన్లూ ట్యాప్‌ చేసి బలహీనమైంది బీఆర్‌ఎస్‌ వాళ్లేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కుమార్తె కవితకు రేవంత్‌ను విమర్శించే స్థాయి లేదని, ఆమె ఓవర్‌ యాక్షన్‌ చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిది సమాన హోదా అని, వారిద్దరూ మాట్లాడుకుంటేనే బాగుంటుందన్నారు. ‘‘కవితకు తండ్రితో పంచాయితీ ఉంటే వాళ్లు.. వాళ్లు.. చూసుకోవాలి. కేసీఆర్‌కు వారసత్వం కొడుకు అవుతాడు కానీ... కూతురు కాదు. అసలు కేసీఆర్‌ ఇల్లే ఒక డ్రామా కంపెనీ అయిపోయింది. పదేళ్లలో ఎన్నడూ లేనిది.. కవితకు ఇప్పుడు బీసీలు, మహిళలు గుర్తుకు వచ్చారు. లిక్కర్‌ బిజినెస్‌ పెట్టడానికి ఆమెకు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కవిత వల్లనే కేజ్రీవాల్‌, సిసోదియా జైలుకు వెళ్లింది వాస్తవం కాదా? లిక్కర్‌ డాన్‌గా ఉన్న కవిత.. కాంగ్రె్‌సపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు.


9 ఏళ్ల తర్వాత సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా

ఈ టర్మ్‌తో పాటు వచ్చే ఐదేళ్లూ సీఎంగా ఉండాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. 9 ఏళ్ల తర్వాత సీఎం అయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వాళ్లకు ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశం రాదన్నారు.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 03:55 AM