Jagga Reddy: కేటీఆర్, హరీశ్ సెకండ్ బెంచ్ లీడర్స్.. వీళ్ల జోక్యం అవసరం లేదు..
ABN , Publish Date - Jul 05 , 2025 | 07:25 PM
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు కేటీఆర్ స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) రియాక్ట్ అయ్యారు.

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమంపై నిన్న చేసిన సవాల్‌పై కేటీఆర్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి సీతక్క సహా పలువురు స్పందించగా, తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో కేసీఆర్, రేవంత్ లాంటి ఫస్ట్ బెంచ్ నాయకుల మధ్య జరిగే చర్చల్లో కేటీఆర్, హరీశ్ రావు వంటి సెకండ్ బెంచ్ నాయకుల జోక్యం అవసరమా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌కు సవాల్ చేస్తే
ఎందుకంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని కేసీఆర్‌కు సవాల్ చేస్తే, కేటీఆర్ క్లబ్‌కు రా అని సమాధానం ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇది వారి మధ్య ఉన్న రాజకీయ నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య రాజకీయ పోరు ఎప్పుడూ ఉంటుంది. కానీ వీరి మధ్యలో కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ వైఖరి ఏంటి..
అంతేకాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు గతంలో ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజలపై కూడా తీవ్ర విమర్శలు చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రోళ్లను దొంగలని, నీళ్లను ఎత్తుకెళ్లారని ఎన్నో అన్నారని చెప్పారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిని ఎందుకు ఇంటికి పిలిచాడని పేర్కొన్నారు. ఈ విషయంలో కేసీఆర్ రాజకీయ వైఖరి ఏంటో స్పష్టంగా తెలుస్తుందని జగ్గారెడ్డి తెలిపారు.
ఉద్యమ సమయంలో కూడా..
రేవంత్ రెడ్డి సవాళ్లపై కేటీఆర్ ప్రెస్ మీట్‌లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపవన్నారు. కేటీఆర్ రాజకీయంగా రేవంత్‌తో సమానంగా తలపడాలంటే, బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను కేసీఆర్ నుంచి తీసుకుని మాట్లాడాలని జగ్గారెడ్డి అన్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు జగ్గారెడ్డి. సోనియా గాంధీ ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ కూడా పడకూడదని చెప్పారని, కేసీఆర్‌ను నిమ్స్‌లో చేర్చి, ఉద్యమానికి మద్దతు ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని వెల్లడించారు. చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి