Yoga Day: యోగభాగ్యం!
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:36 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో శనివారం ఘనంగా జరిగింది. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన యోగా డే కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
బాలయోగి స్టేడియంలో 5వేల మందితో ఘనంగా యోగా డే
హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు మంత్రులు
శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసేది యోగా : మంత్రి దామోదర రాజనర్సింహ
వరంగల్ ఎన్‌ఐటీలో త్వరలో యోగా సర్టిఫికెట్ కోర్సు
హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ సిటీ, బంజారాహిల్స్, ఖిలావరంగల్, హనుమకొండ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో శనివారం ఘనంగా జరిగింది. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన యోగా డే కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 5వేల మందితో యోగా డే కార్యక్రమాన్ని ఆయుష్, ఆరోగ్య శాఖలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, శాప్ చైర్మన్ శివేసన రెడ్డి తదితర ప్రముఖులతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మను ఏకం చేేస అద్భుతమైన సాధనమని అన్నారు. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేేసందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక, ప్రపంచదేశాలకు యోగాను పరిచయం చేసిన భారత్.. యోగాకి అడ్డాని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
అలాగే, హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో జరిగిన యోగా డేలో రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్‌లో స్వచ్ఛ భారత్ అబియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ జితేందర్, అదనపు డీజీపీ మహే్‌షభగవత్ తదితరులు యోగాసనాలు వేశారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించిన యోగా డే వేడుకలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక, కేంద్ర పురావస్తు శాఖ, ఆయుష్ విభాగాల ఆధ్వర్యంలో ఖిలావరంగల్‌లోని కీర్తితోరణాల మధ్య జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది యోగాసనాలు వేశారు. పద్మశీ అవార్డు గ్రహీత కెత్‌వాత్ సోమ్లానాయక్, జిల్లా కలెక్టర్, పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ ఎన్‌ఐటీ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 7.45గంటల వరకు ప్రొఫెసర్ పి.రవికుమార్ ఆధ్వర్యంలో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. వరంగల్ ఎన్‌ఐటీలో త్వరలో యోగాలో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభిస్తామని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ఈ సందర్భంగా తెలిపారు. యోగాపై సంపూర్ణ అవగాహన పొందడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుందని చెప్పారు.
యోగా డేలో అపశ్రుతి !
జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన కస్తూర్బా, సాంఘిక సంక్షేమ గురుకులాలు, మహాత్మా జ్యోతిభాపూలే ఆశ్రమ పాఠశాలలు, మైనార్టీ స్కూళ్లు, మెడికల్, నర్సింగ్ కళాశాలల విద్యార్థులను తెల్లవారుజామున నాలుగు గంటలకే ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. వీరందరికీ యోగా అనంతరం అల్పాహారం అందించారు. ఈ క్రమంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న వాహనం దగ్గర జరిగిన తోపులాటలో గాంధీ ఆస్పత్రి నర్సింగ్ విద్యార్థిని నజీమా స్పృహ కోల్పోయింది. నజీమా సొమ్మసిల్లి పడిపోవడాన్ని గమనించిన పోలీసులు ఆమెను హుటాహుటిన కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న నజీమాను వైద్యులు వెంటనే డిశ్చార్జి చేశారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ నజీమాను పరామర్శించారు. కాగా, అల్పాహారం అందించే అంశంలో వైద్య శాఖ అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. చాలా మందికి అల్పాహారం అందలేదని వాపోయారు.
ఇవి కూడా చదవండి..
9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను
For International News And Telugu News