Weather Alert: రాష్ట్రంలో మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:40 AM
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావారణశాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

మంచిర్యాల జిల్లాలో 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్.. నేడు, రేపు వర్షసూచన
(ఆంధ్రజ్యోతి నెట్ వర్క్), ఏప్రిల్ 12: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వాతావారణశాఖ పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్‌లో అత్యధికంగా 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో 43 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో 42.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో41.4 డిగ్రీలు, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో 40.3 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా రామగుండం, మహబూబ్‌నగర్ జిల్లాలో 40 డిగ్రీలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో 39.2 డిగ్రీలు, నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాల్లో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ పేర్కొంది. కాగా.. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 14 నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.