Ashwini Vaishnaw: నేటి నుంచే దావోస్ సదస్సు
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:47 AM
స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పెట్టుబడుల/ఆర్థిక సదస్సు- 2025 ప్రారంభంకానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది.

ఐదు రోజులపాటు నిర్వహణ.. పెట్టుబడులపై భారత్ భారీ ఆశలు
దావోస్, జనవరి 19: స్విట్జర్లాండ్‌లోని దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పెట్టుబడుల/ఆర్థిక సదస్సు- 2025 ప్రారంభంకానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈసారి ఐదుగురు కేంద్ర మంత్రులో కూడిన పెద్ద బృందాన్నే దావో్‌సకు పంపింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక, ఈ సదస్సుకు ముగ్గురు ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అదేవిధంగా వంద మందికిపైగా సీఈవోలు హాజరుకానున్నారు.
‘‘ప్రధాని మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, భారత్ ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త డిజిటల్ ఇండియా కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా ప్రపంచ దేశాలకు వివరించనున్నాం’’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌తో పాటు సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌధరి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు హాజరవుతారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, దేవేంద్ర ఫడణవీస్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలు రాష్ట్రాల మంత్రులు పాల్గొననున్నారు. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానమనే అంశాన్ని కేంద్రం సదస్సులో ప్రధానంగా ప్రస్తావించనుంది. 130 దేశాల నుంచి 3 వేల మంది నాయకులు, 1600 మంది వ్యాపార దిగ్గజాలు, 120మంది టెక్ దిగ్గజాలు సదస్సుకు హాజరుకానున్నారు.