AV Ranganath:ఆరోగ్య హైదరాబాద్.. ఇదే హైడ్రా లక్ష్యం
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:01 AM
హైడ్రా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంస్థ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సంస్థ..

ఏడాదిలో ఎంతో నేర్చుకున్నాం.. మొదట్లో కొంత గందరగోళం.. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాం
కూల్చుడే కాదు.. చెరువుల నిర్మాణమూ సంస్థ బాధ్యతే
అక్టోబరు నుంచి చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
రూ.30 వేల కోట్ల విలువైన భూములు కాపాడాం
సంస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది
నిధులకు ఇబ్బంది లేదు.. ప్రభుత్వం సహకరిస్తోంది
‘ఆంధ్రజ్యోతి’తో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): హైడ్రా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంస్థ! అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సంస్థ! చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏర్పడి ఈ నెల 19కి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. చెరువులు, పార్కులతో భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన హైదరాబాద్‌ను అందించడమే తమ లక్ష్యమన్న రంగనాథ్.. ఇక నుంచి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. కూల్చడమే కాదు.. చెరువుల నిర్మాణాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.
హైడ్రా పనితీరు, తదుపరి లక్ష్యాలు ఏంటి?
ఏడాది కాలంలో ఎక్కువ మంచి, అక్కడక్కడా చేదు అనుభవాలు ఉన్నాయి. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకోవడం సంతృప్తినిస్తోంది. సంస్థ ఏర్పాటు చేసిన మొదట్లో కొంత గందరగోళం ఉండింది. ఆక్రమణల తొలగింపు సమయంలో కొంత మానవతా దృక్పథంతో ఉండాల్సింది. ఒకటి, రెండు చోట్ల అది లోపించింది. సామాన్లు బయటపెట్టే సమయం ఇవ్వకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారాయి. దీంతో సంస్థపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటున్నాం. మాకూ పలు అంశాలపై అవగాహన వచ్చింది. ఇంకా నేర్చుకుంటున్నాం.
ఎన్ని ఆక్రమణలు తొలగించారు?
ఎంత భూమి స్వాధీనం చేసుకున్నారు?
హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. 25 వేల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. 500 ఎకరాలకు పైగా స్థలాలను స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ రూ.25-30 వేల కోట్లపైనే ఉంటుంది. 75 పార్కులు, 45 చెరువుల్లో 550 ఆక్రమణలను తొలగించాం. ఏడాదిలో ఏ సంస్థపైనా ఇంత చర్చ జరిగి ఉండదు. నాలాల విస్తరణ పనులను జీహెచ్‌ఎంసీతో కలిసి చేస్తున్నాం. ఇటీవల బెంగళూరు ఇంజనీరింగ్ అధికారులు నగరానికి వచ్చి, ఆక్రమణల తొలగింపులో ఎలా ముందుకెళ్తున్నామో తెలుసుకున్నారు.
చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ఎప్పుడు?
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 140 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరిగింది. మరో 500 చెరువులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. పది రోజుల క్రితం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ఇచ్చింది. 2006లో నాలా, చెరువుల విస్తీర్ణం ఎంత? ఇప్పుడు ఎంత? అన్నది ఈ చిత్రాలతో తెలుస్తుంది. దాన్ని బట్టి ఎఫ్‌టీఎల్‌ను సూత్రప్రాయంగా నిర్ధారించవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం. ఇందుకు రెండు, మూడు నెలలు పడుతుంది. అక్టోబరు నుంచి దశల వారీగా ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తాం. ఆ తర్వాత ఫెన్సింగ్ వేస్తాం.
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదిక ఏంటి?
ప్రస్తుతం ఆరు చెరువులను మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. కూల్చుడు మాత్రమే కాదు.. చెరువుల నిర్మాణమూ హైడ్రా లక్ష్యం. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే చెరువులు స్వచ్ఛంగా ఉండాలి. పార్కుల పునరుద్ధరణ ద్వారా పర్యావరణహిత నగరంగా మార్చే యత్నం చేస్తున్నాం. ఈ ఏడాది మా ప్రధాన దృష్టి వీటిపైనే. హైడ్రాకు అదనపు బాధ్యతలేమీ లేవు. సంస్థ చేయాల్సిన పనులే అప్పగిస్తున్నారు. వర్షాకాల అత్యవసర బృందాలు విపత్తుల నిర్వహణలో భాగం. వర్షాలు లేని సమయంలో 940 కల్వర్టులు, క్యాచ్‌పిట్ల వద్ద వ్యర్థాలు తొలగిస్తున్నాం. దీంతో వరద సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుంది. అత్యవసర బృందాలు సక్రమంగా పని చేయడం లేదని గుర్తిస్తే కాంట్రాక్టరుతోపాటు సంబంధిత అధికారులపై చర్యలుంటాయి. ముంపు సమస్య ఎక్కువగా ఉన్న ప్యాట్నీ, ఖైరతాబాద్, కూకట్‌పల్లిలో నాలాలపై ఆక్రమణలు తొలగించాం. నాలాలపై ఉన్న ఇళ్లు తొలగించం. తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వస్తే బాధిత కుటుంబాలకు సర్కారు పునరావాసం కల్పిస్తుంది. బతుకమ్మకుంట విస్తీర్ణం 15 ఎకరాలు. చెరువు పక్కన బస్తీలు ఉండడంతో వాటి జోలికి వెళ్లలేదు. అందుబాటులో ఉన్న ఐదెకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం.
హైడ్రాలో సరిపడా సిబ్బంది ఉన్నారా?
విపత్తు నిర్వహణ బృందాలు కాకుండా ప్రస్తుతం అధికారులు, ఉద్యోగులు 50 మంది ఉన్నారు. చాలా మంది రావాల్సి ఉంది. వివిధ విభాగాల నుంచి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంటెలిజెన్స్ విచారణ తర్వాతే తీసుకుంటున్నాం. సాంకేతిక కారణాలతో హైడ్రా పోలీస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు మొదలు కాలేదు. 10-15 రోజుల్లో ప్రారంభిస్తాం. గతంలో అధికారులపై వివిధ పోలీస్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు ప్రభుత్వానికి పంపాం. సర్కారు కొన్ని ఏసీబీకి పంపింది. కొందరిపై శాఖాపరమైన చర్యలకూ సిఫారసు చేసినట్టు తెలిసింది.
జంట జలాశయాల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తయ్యిందా?
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తుది ఎఫ్‌టీఎల్ నిర్ధారణ కాలేదు. కొందరు ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. నోటిఫై చేసిన అనంతరం ఆక్రమణలపై స్పష్టత వస్తుంది. సాంకేతిక అంశాల్లో కొంత ఆలస్యం జరుగుతోంది. చట్టానికి చిన్న, పెద్ద అనే వ్యత్యాసం ఉండదు. హైడ్రా వచ్చిన తర్వాత చెరువుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం చాలా వరకు తగ్గింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలమా..? అన్నది ప్రజలు తెలుసుకుంటున్నారు. చెరువుల సమీపంలో ఉంటే కొనడం లేదు. కొనేవాడు లేనప్పుడు కట్టేవాడికి ధైర్యం ఉండదు కదా!
చెరువుల అభివృద్ధికి నిధులెలా..?
వీలైనంత మేరకు నగరంలో చెరువులను పునరుద్ధరించాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో సామాజిక బాధ్యతగా చెరువుల అభివృద్ధికి ముందుకు వచ్చే సంస్థలకూ అవకాశం కల్పిస్తాం. రియల్ ఎస్టేట్ సంస్థలను భాగస్వాములను చేయం. చెరువుల అభివృద్ధి, విపత్తుల నిర్వహణ మెరుగైతే నగరానికి ముంపు ముప్పు తగ్గుతుంది.
నిర్మాణ రంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌ను అడ్డుకుంటున్నారా?
చెరువులు, మూసీ, నాలాల్లో నిర్మాణ రంగ వ్యర్థాల అక్రమ డంపింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంది. వ్యర్థాల డంపింగ్ ఆగితే ఆక్రమణలూ తగ్గుతాయి. సీసీ కెమెరాలూ పెట్టి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేస్తాం. డ్రోన్స్ టెక్నాలజీతో హాట్ స్పాట్‌లు గుర్తిస్తాం. వాహనాలు సీజ్ చేయడంతోపాటు బాధ్యులపై కేసులు పెడుతున్నాం. పారిశ్రామిక, రసాయన వ్యర్థాల అక్రమ డంపింగ్‌ను నిలువరించే ప్రయత్నమూ చేస్తున్నాం. సంబంధిత విభాగాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. విస్తృత సాంకేతిక సేవల కోసం హైడ్రాలో ఐటీ విభాగం ఏర్పాటు కాబోతుంది.