Illegal Encroachments: మట్టి పోసి.. మూసీని కబ్జా చేసి..
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:00 AM
మూసీని మూసేసి దర్జాగా దందా చేస్తున్న అక్రమార్కులకు హైడ్రా చెక్ పెట్టింది. నదిని వ్యర్థాలతో నింపి నిర్మించిన ఆక్రమణలను తొలగించింది.

వాహనాల పార్కింగ్‌కు ఇచ్చి ఫీజు వసూళ్లు.. షెడ్లు నిర్మించి ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులకు అద్దెకు
చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా వరకు 10.22ఎకరాలు చెరబట్టిన వైనం
ఆక్రమణలను కూల్చి.. ఫెన్సింగ్ వేసిన హైడ్రా
హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మూసీని మూసేసి దర్జాగా దందా చేస్తున్న అక్రమార్కులకు హైడ్రా చెక్ పెట్టింది. నదిని వ్యర్థాలతో నింపి నిర్మించిన ఆక్రమణలను తొలగించింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలువురు 10.22 ఎకరాల భూమిని చెరబట్టారు. నదిలో 20 నుంచి 25 మీటర్ల మేర మట్టి, వ్యర్థాలతో నింపి రోడ్డుకు సమాంతరంగా చేశారు. ఉస్మానియా మార్చురీ పక్కన 3.10 ఎకరాల స్థలాన్ని తికారం సింగ్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. షెడ్లు నిర్మించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 1.30 ఎకరాలను చెరబట్టిన పూనం చంద్ యాదవ్.. ప్రైవేట్ బస్సులు, టాక్సీల పార్కింగ్ స్థలంగా కేటాయించడంతోపాటు.. షెడ్లు నిర్మించి నర్సరీ, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. జయకృష్ణ అనే వ్యక్తి 5.22 ఎకరాలు కబ్జా చేసి.. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలకు అద్దెకిచ్చాడు. నదిని ఆక్రమించి వీళ్లంతా కొన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. నిర్మాణాలను కూల్చి వేసి, మున్ముందు కబ్జాలకు గురికాకుండా స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. నది ఒడ్డున ఉన్న నివాసాల జోలికి వెళ్లలేదు.
గతంలో కేసులు నమోదైనా..
ఈ ముగ్గురు వ్యక్తుల ఆక్రమణల తొలగింపుపై రెవెన్యూ విభాగం కనీస చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదులు అందితే నోటీసులు ఇవ్వడం మినహా ఏమీ చేయలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో హైదరాబాద్ కలెక్టర్ బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆక్రమణదారులు యథేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. వాహనాల పార్కింగ్, పండ్లు నిల్వ చేసే ఫ్రీజర్ల ఏర్పాటుకు మెజారిటీ స్థలాన్ని వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ.300 చొప్పున పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారని హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సాయంత్రం 4 గంటల సమయంలో పూనంచంద్ యాదవ్ అక్కడికి చేరుకుని ఈ స్థలం తనదేనని, 40 ఏళ్ల క్రితం నాటి పట్టాలున్నాయని, ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లిస్తున్నానని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు.
సుందరీకరణతో సంబంధం లేదు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో కూల్చివేతలకు సంబంధం లేదు. నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించాం. పౌరుల నివాసాల జోలికి వెళ్లలేదు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చెరువులు, నాలాలు, పార్కులు, రహదారుల కబ్జాల తరహాలోనే మూసీ ఆక్రమణలు తొలగించాం.
- ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News