Yoga Day Stampede: యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:10 AM
Yoga Day Stampede: యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి స్పృహకోల్పోయింది.

హైదరాబాద్, జూన్ 21: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది. గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేస్తుండగా ఒకరినొకరు తోసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువతి స్పృహకోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. యువతిని హుటాహుటిన అంబులెన్స్‌లో కొండాపూర్ ఏరియా హస్పటల్‌కు తరలించారు. యువతికి చికిత్స అందజేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. యువతి గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు.
యోగా డే సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు. యోగా పూర్తి చేసిన తర్వాత గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ ఫాస్ట్ పంపిణీ కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రజలు గేట్ నెంబర్ 2కు వెళ్లడంతో తోపులాట, తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో గాంధీ ఆస్పత్రి మెడికల్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అనుకున్న దాని కంటే ఎక్కువ మంది రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇక.. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు, పలువురు సెలబ్రిటీలు యోగా డేలో పాల్గొని ఆసనాలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజల రాకతో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. యోగా వేడుకల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల
Read latest Telangana News And Telugu News