Women Owners: మహిళా స్వయం సహాయక బృందాలకు 600 బస్సులు
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:43 PM
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.
హైదరాబాద్, నవంబర్, 18: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామీణ మహిళల సాధికారత కోసం మరో అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) కింద, మహిళల స్వయం సహాయక బృందాలకు (SHGs) మొత్తం 600 బస్సులు అందించనుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు బస్సుల యజమానులుగా మారి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశం లభిస్తుంది. ఇది మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలోపేతం చేస్తూ, గ్రామీణ పేదరిక నిర్మూలనకు కీలకంగా నిలవనుంది.
ఈ స్కీమ్ ప్రకారం, ఒక్కో బస్సు ధర సుమారు రూ.36 లక్షలు. మహిళా బృందాలు రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (CIF) ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. బస్సులు మహిళల యాజమాన్యంలో ఉంటాయి. కానీ, ఈ బస్సులను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నడిపిస్తుంది. TGSRTC ప్రతి బస్సుకు నెలకు రూ.69,648 చెల్లిస్తుంది. ఇందులో రూ.19,648 ఆపరేషనల్ ఖర్చులకు, మిగిలినది లోన్ తిరిగి చెల్లింపునకు వాడతారు.
ఇలా 7 సంవత్సరాలపాటు రిస్క్ లేకుండా స్థిర ఆదాయం లభిస్తుంది. కార్యక్రమం దశలవారీగా అమలవుతోంది. మొదటి దశలో 17 జిల్లాల్లో 151 మహిళా బృందాలు 151 బస్సులు పొందాయి. రెండో దశలో మిగిలిన 449 బస్సులు కొనుగోలు చేస్తారు. ఈ బస్సులు తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి స్కీమ్ కింద ఉచిత ప్రయాణాలకు సహాయపడతాయి. గ్రామీణ ప్రాంతాలకు మరిన్ని బస్సులు అందేలా చేస్తాయి. ఇది RTCని ప్రైవేట్ బస్సులపై ఆధారపడకుండా, మహిళల యాజమాన్య బస్సులపై ఆధారపడేలా మార్చుతుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.5 కోట్లు కేటాయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే
Read Latest AP News And Telugu News