Wife Attack On Husband: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు పీక పిసికి చంపింది
ABN , Publish Date - Jul 05 , 2025 | 09:25 PM
ప్రియుళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. కానీ, ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది.

హైదరాబాద్ జులై, 5: ప్రియుళ్ల మోజులో పడి.. కట్టుకున్న భర్తల్ని ఇటీవలి కాలంలో కొంత మంది భార్యలు చంపేస్తున్నారు. వాళ్లంతా కిరాయి మూకలతోనో, ప్రియుళ్ల సాయంతోనో భర్తల్ని పరలోకాలకు పంపించారు. ఇవాళ(శనివారం) మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో ఓ భార్య దీనికి భిన్నంగా చేసింది. ఎవరి సాయం తీసుకోకుండా అర్ధరాత్రి స్వయంగా ఆమె చేతులతోనే భర్త పీక పిసికి ప్రాణాలు తీసేసింది. అయితే, ఆ సమయంలో భర్త ఫుల్ గా మద్యం సేవించి ఉండటంతో పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ప్రాణాలొదిలాడు.
ఆ తర్వాత తన నటనతో విజృంభించింది ఆ మహా ఇల్లాలు. అయ్యనా దేవుడో అంటూ.. దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్వటం మొదలుపెట్టింది. నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా? పతిదేవుడో అంటూ గగ్గోలు పెట్టింది.. ఏం కష్టమొచ్చిందని ప్రాణాలు తీసుకున్నావు మహానుభావా అంటూ సందట్లో సడేమియా చేసి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం నారాయణపేటకు తీసుకెళ్లి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ఇంతవరకూ బాగానే నెట్టుకొచ్చింది కానీ ఎక్కడైనా కొంచెం డోసు ఎక్కువైందో ఏమో, మృతుడి భార్య ప్రవర్తనపై బంధువులకు కాస్త అనుమానం వచ్చింది. శవాన్ని పరీక్షగా చూడడం మొదలు పెట్టి మొత్తానికి పసిగట్టారు. అంజిలప్ప గొంతుపై ఉన్న మరకలను చూసి భర్త గొంతు నొక్కేసి చంపేసుంటుందని నిర్ధారించుకుని పోలీసుల్ని పిలిచారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడి భార్య రాధను ప్రశ్నించారు. ఆమెపై అనుమానంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా.. ఆమె అసలు విషయం చెప్పేసింది.
ఇక, దారుణానికి సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా రామకృష్ణయ్యపల్లికి చెందిన అంజిలప్పతో రాధ అనే మహిళకు 2014లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణ సంస్థలో భార్యాభర్తలిద్దరూ కూలీలుగా చేరి.. అక్కడే గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్ మాట్లాడొద్దని భర్త అంజిలప్ప ఆమెను మందలించాడు. దీంతో అంజిలప్పపై కోపం పెంచుకున్న రాధ.. జూన్ 22న అర్ధరాత్రి మద్యంమత్తులో ఉన్న భర్త గొంతు నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించిందని.. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి