Share News

RTC Strike Notice: బస్సులు ఆగిపోనున్నాయా.. నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ సంఘాలు

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:29 PM

RTC JAC: తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని బస్‌బవన్‌ చేరుకున్న కార్మిక సంఘం నేతలు నోటీసులు ఇచ్చారు. నోటీసులపై ప్రభుత్వం స్పందించని పక్షంలో కార్మికులు సమ్మెకు దిగే అవకాశం ఉంది.

RTC Strike Notice: బస్సులు ఆగిపోనున్నాయా.. నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ సంఘాలు
Telangana RTC

హైదరాబాద్, జనవరి 27: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ (TRC JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సెలవులపై ఉండటంతో బస్‌భవన్‌ లోపల ఈడీ మునిశేఖర్‌కు కార్మిక సంఘాలు సోమవారం నాడు నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బస్ భవన్ వద్దకు భారీగా ఆర్టీసీ కార్మక సంఘాలు చేరుకున్నాయి. దీంతో బస్‌భవన్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే డ్రైవర్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఉన్న డ్రైవర్లనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 21వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. లేనిపక్షంలో సమ్మె చేసే ఆలోచనలో ఆర్టీసీ సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగులు సహకరిస్తారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది.

ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం.. అదిరిపోయే వార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం


కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని.. అలాగే ఆర్టీసీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. అలాగే ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా పనిభారం కూడా పెరిగిందని కార్మికులు వాపోతున్నారు.


ఈవీ బస్సులను స్వాగతిస్తున్నామని.. కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు.. రిటైర్డ్ అయిన వారి సమస్యలు ఇంకా తీరనే లేదని, పెండింగ్‌లో బకాయిలు, అడుగు పడని పేస్కేళ్లు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, డీఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ ఎన్నో హామీలు ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. నోటీసులపై ప్రభుత్వం స్పందించని పక్షంలో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.

Updated Date - Jan 27 , 2025 | 04:55 PM