IPS Officers High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:56 PM
IPS Officers High Court: భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 29: భూదాన్ భూముల వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌లు తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఆశ్రయించారు. భూదాన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు ఐపీఎస్ అధికారులు. 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పుపై ఐపీఎస్‌లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా అప్పీల్ దాఖలు చేశారు.
కాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే 182,194,195లో భూదాన్ భూముల విషయంలో కొంత కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ భూముల్లో మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫానా, సుఖుర్ అక్రమంగా లే అవుట్ చేసి అమ్మకాలు జరిపారు. భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు విచారణ జరిగింది. ఉన్నతాధికారులకు పాత్రపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. 50 ఏళ్లకుపైగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు అధికారులు కబ్జా చేయాలని చూస్తున్నారని బిర్లా మహేశ్ పిటిషన్ వేశారు. రెవెన్యూ అధికారుల సాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్ల మీద భూములు బదలాయింపు చేశారని ఆరోపించారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భూముల వ్యహారంలో మాజీ సీఎస్ లు, మాజీ డీజీపీలు, సీనియర్ ఐఏఎస్ లు, సీనియర్ పోలీసు అధికారుల పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ, ఈడీ విచారణ చేస్తేగాని వాస్తవాలు బయటికి వచ్చేలా లేవని హైకోర్టు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సీబీఐలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే నవీన్‌మిట్టల్, మహేశ్ భగవత్, డాక్టర్ జ్ఞానముద్ర వంటి 26 మంది కీలక ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు హైకోర్టులో అప్పీలు చేశారు.
మరోవైపు హైకోర్టు ఆదేశాలతో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 13 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు జరిపింది. మునావర్‌కు చెందిన 40 వింటేజ్ కార్లు సీజ్ చేసింది. మునావర్ ఇంట్లో భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకుంది. మునావర్ భూ లావాదేవీల పత్రాలను ఈడీ సీజ్ చేసింది. వందల ఎకరాలను కబ్జా చేసి రియల్టర్లు, అధికారులకు అమ్మకం జరిపినట్లు ఈడీ గుర్తించింది.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క రియాక్షన్
Read Latest Telangana News And Telugu News