Share News

Telangana BJP: బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:47 PM

Telangana BJP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Telangana BJP: బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి
Telangana BJP

హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) డుమ్మాకొట్టారు. నగరంలోని బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా.. కొద్ది రోజులుగా కిషన్‌ రెడ్డి, రాజాసింగ్ మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నడుస్తున్నట్లుగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ సమైక్యత కోసం పాటుపడుతున్న పార్టీ. అన్ని కులాలకు, వర్గాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చే పార్టీ. అటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతీ ఒక్క వర్గాన్ని, ప్రతీఒక్క నేతను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, అయితే రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్న కిషన్ రెడ్డి కొద్దిమందికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, కొద్ది సంవత్సరాలుగా పార్టీలో సీనియర్లు పేరుకుపోయారని, వారిని తక్షణమే పార్టీ నుంచి బయటకు పంపిస్తే తప్ప బీజేపీ రాష్ట్రంలో మనుగడ లేదు అని కొద్దిరోజులుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.


లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో కూడా రాజాసింగ్ తన అభిప్రాయాన్ని రాష్ట్ర నాయకత్వానికి బాహాటంగానే వ్యక్తపరిచారు. ఈ అభ్యర్థిత్వాన్ని ఆమోదించబోమని, బీసీలకు అవకాశం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. అయితే బండి సంజయ్ కలుగుజేసుకుని రాజాసింగ్‌కు సముదాయించే ప్రయత్నం చేశారు. హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా రాజాసింగ్‌తో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం తరపు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తనది అంటూ బండిసంజయ్‌ భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే రోజు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతా కలిసే పనిచేస్తామని, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తామని మీడియా సమావేశంలో రాజాసింగ్ చెప్పారు కూడా.


కానీ ఈరోజు బేగంపేటలోని హరితప్లాజాలో జరుగుతున్న హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక సమావేశానికి రాజాసింగ్ మరోసారి దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎంపీలు ఈటెల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే హైదరాబాద్ నుంచి బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం దూరంగా ఉన్నారు. హనుమాన్ జయంతి రోజు సయోధ్యకుదిరిందని అంతా భావించినప్పటికీ ఈరోజు పార్టీ కార్యక్రమానికి రాజాసింగ్ దూరంగా ఉండటంతో పార్టీ విభేదాలు సర్దుమణగలేదా అనే చర్చ మరోసారి ఊపందుకుంది.


ఇవి కూడా చదవండి

Summer Vacation Safety Tips: తస్మాత్ జాగ్రత్త.. పిల్లల సరదా ఆట విషాదం కావొద్దు

Cool Drink Incident: అసలేం తినేటట్టు లేదు.. తాగేట్టూ లేదుగా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 03:00 PM